మంత్రులు, ఎమ్మెల్యేలకు పడ్తలేదు

మంత్రులు, ఎమ్మెల్యేలకు పడ్తలేదు

టీఆర్‌ఎస్‌లో లీడర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి నెలకొంది. బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. తమకు పదవి రాకుండా చేశారని దూషించుకుంటున్నారు. మంత్రులుగా ఛాన్స్‌ కొట్టిన వాళ్లు ఎన్ని రోజులు అందులో కొనసాగుతారో చూస్తామని ఇతర ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుతున్నారు. ఒక మంత్రికి మరో మంత్రికి కూడా పడడటం లేదు.

హైదరాబాద్‌, వెలుగు:  రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సీన్‌  కనిపిస్తోంది. ‘ఫలానా వాళ్లకు ఎందుకు ఛాన్సిచ్చారు’ అని హైకమాండ్‌ వద్ద ఓపెన్‌గానే కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ వర్గాలకు నడుమ చిచ్చు రగులుతోంది. మహబూబ్‌నగర్‌లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్​ వర్గాల మధ్య పొసగడం లేదు. ఆదిలాబాద్‌ మంత్రికి వ్యతిరేకంగా అక్కడి ఎమ్మెల్యేలంతా ఏకమైనట్లు సమాచారం.

త్వరలో సీఎంను కలిసి ఆయనపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసిన రెడ్యా నాయక్‌.. సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లా నేతలు మంత్రి పువ్వాడ అజయ్‌కి వ్యతిరేకంగా జట్టు కట్టారు. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కగానే రంగారెడ్డి జిల్లా నేతలు తమ ఉనికిపై ఆందోళన చెందుతున్నారు. చివరికి సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లోనూ వర్గ పోరు నెలకొంది.

నల్గొండలో గుత్తా గ్రూప్‌ నారాజ్‌

తెలంగాణ వచ్చాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీశ్ రెడ్డి హవా అంతా ఇంత కాదు. అప్పట్లో జిల్లాలో ఆయనొక్కరే మంత్రి కావడంతో అందరూ ఆయన చుట్టూ తిరిగేవారు. రెండో టర్మ్​లో గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని సీఎం కేసీఆర్ హామీచ్చారు. ఎమ్మెల్సీకాగానే ఇక మంత్రి కావడం తరువాయి అనే ధీమా గుత్తా వర్గంలో వచ్చింది. కానీ   ఆయనకు మంత్రి పదవి రాలేదు. దీనిపై ఇప్పటికీ గుత్తా వర్గీయుల్లో అసంతృప్తి ఉంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు.నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏదో ఒక జిల్లా కోటా నుంచి మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశపడ్డారు.

ఆయన వల్లే మంత్రి పదవి రాలేదట!

మెదక్ జిల్లాలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వర్గం, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గం మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇద్దరూ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ టికెట్ ను శేరి సుభాష్​రెడ్డి ఆశించారు. కానీ అభ్యర్థులను మార్చడం కష్టమని కేసీఆర్ చెప్పడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. అటు తర్వాత సుభాష్​రెడ్డికి అసెంబ్లీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. మెదక్ జిల్లా నుంచి  పద్మా దేవేందర్ రెడ్డితో పాటు సుభాష్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు. దీంతో ఇద్దరిలో ఎవరికీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు అంటున్నారు. సుభాష్ రెడ్డి వర్గం వల్లే పద్మాదేవేందర్​రెడ్డికి మంత్రి పదవి రాలేదని ఆమె వర్గీయులు అంటున్నారు. నియోజకవర్గంలో కూడా  సుభాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. నియోజకవర్గం నాయకులను సుభాష్​రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం పద్మా దేవేందర్ రెడ్డికి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. సుభాష్ కొన్ని రోజుల క్రితం తన ఊరిలో  ఓ పురాతన దేవాలయం ఆధునీకరణ కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ ఆర్కిటెక్  ఆనంద్ సాయిని పిలిచి హడావుడి చేయడం పద్మాదేవేందర్​రెడ్డి వర్గీయుల్లో ఆగ్రహానికి దారితీసింది.

నిజామాబాద్  మంత్రికి, ఎమ్మెల్యేలకు మధ్య దూరం!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయనకు కేబినెట్ లో బెర్త్ ఇవ్వడం కోసం.. గత టర్మ్​లో మంత్రిగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈసారి స్పీకర్ పదవిని ఇచ్చారు. తమ నాయకుడికి మంత్రి పదవి దక్కకపోవడంపై పోచారం అనుచరులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డికి  జిల్లా ఎమ్మెల్యేలతో పెద్దగా సఖ్యత లేదని,  ప్రగతిభవన్ కే పరిమితమవుతారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరో సీనియర్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​కు మంత్రి పదవి దక్కలేదని ఆయన సన్నిహితులు కూడా అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో ఇతర ఎమ్మెల్యేలకు, మంత్రికి మధ్య గ్యాప్​ ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య బోధన్ ఎమ్మెల్యే షకీల్ బీజేపీ ఎంపీ అర్వింద్ ను కలిసి పార్టీ వీడుతానని సంకేతాలు ఇస్తే జిల్లా మంత్రి వేముల పట్టించుకోలేదని కేడర్​ విమర్శిస్తోంది.

ఆదిలాబాద్​లో మంత్రిపై ఎమ్మెల్యేల గరం.

హైదరాబాద్ కు చెందిన పార్టీ నాయకులు ఒక్కొక్కరి తీరు ఒక్కో రకంగా ఉంది. కిరాయిదారుల మాటనే పార్టీలోచెల్లు బాటు అవుతోందని ఇటీవల నాయిని నర్సింహారెడ్డి పరోక్షంగా మంత్రి తలసానిని ఉద్దేశించి అసెంబ్లీ లాబీల్లోకామెంట్ చేశారు. పద్మారావు వర్గం కూడా తలసాని వర్గం పైగుర్రుగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నా రు.దానం నాగేందర్ కూడా ఈ మధ్య అంటీముట్టనట్లుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక, మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవి దక్కలేదన్న కారణంతోనే విదేశాలకు వెళ్లిపోయినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

హైదరాబాద్లో ఎవరిదారి వారిదే

హైదరాబాద్ కు చెందిన పార్టీ నాయకులు ఒక్కొక్కరి తీరు ఒక్కో రకంగా ఉంది. కిరాయిదారుల మాటనే పార్టీలో చెల్లుబాటు అవుతోందని ఇటీవల నాయిని నర్సింహారెడ్డి పరోక్షంగా మంత్రి తలసానిని ఉద్దేశించి అసెంబ్లీ లాబీల్లో కామెంట్ చేశారు. పద్మారావు వర్గం కూడా తలసాని వర్గంపై గుర్రుగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. దానం నాగేందర్ కూడా ఈ మధ్య అంటీముట్టనట్లుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక, మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవి దక్కలేదన్న కారణంతోనే  విదేశాలకు వెళ్లిపోయినట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పాలమూరులో నువ్వా..నేనా

తెలంగాణ ఉద్యమ సమయం నుంచే దూకుడుగా ఉండే శ్రీనివాస్ గౌడ్ గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అనే కారణంతో పక్కన పెట్టారు. ఈసారి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన తనదైన శైలిలో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో పట్టు సాధించే ప్రయత్నిస్తున్నారు. ఇది మంత్రి నిరంజన్ రెడ్డి వర్గంలో అసహనం రేపినట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జూపల్లి..  నిరంజన్ రెడ్డి తీరుపై గరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. నియోజకవర్గంలో తనను కాదని ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారని అంటున్నారు. జిల్లాలో మొదట్నించి పార్టీలో ఉన్న లక్ష్మారెడ్డికి ఫస్ట్​ టర్మ్​లో మంత్రి పదవి వచ్చినా.. రెండో సారి దక్కలేదు. ఇప్పుడు ఇద్దరు మంత్రులు లక్ష్మారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మంలో కస్సుబుస్సు

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సీటును మాత్రమే టీఆర్​ఎస్​ గెలుచుకుంది. పువ్వాడ అజయ్  గెలిచారు. ఇటీవలి  కేబినెట్​ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. జిల్లాలో మొదటి నుంచీ గులాబీ నేతలు గ్రూపులుగానే ఉన్నారు. దీంతో అజయ్​కి పదవి రావడంపై పలువురు నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్​ టర్మ్​ టీఆర్​ఎస్​ పాలనలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర్​రావు ప్రస్తుతం కామ్ గా ఉన్నారు.  గోదావరి నది పడవ ప్రమాదంలో తెలంగాణకు చెందినవారు చనిపోయిన సందర్భంలో అజయ్ వ్యవహరించిన తీరుపై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహాయ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశిస్తే ఘటన స్థలానికి వెళ్లిన అజయ్.. నల్లద్దాలు ధరించి అక్కడికి వచ్చిన వారితో  సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఆ విజువల్స్ జాతీయ స్థాయిలో టీవీ చానల్స్ లో ప్రసారమవడంతో పార్టీ, ప్రభుత్వ పరువు పోయిందని ఓ నాయకుడు అన్నారు.

కరీంనగర్ఇలా..

తొలి ప్రభుత్వంలో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య మంచి సఖ్యత ఉండేది. మంత్రి ఈటల వద్దకు అప్పట్లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, కొప్పుల ఈశ్వర్, బొడిగె శోభ, రసమయి బాలకిషన్​ తరచూ వెళ్లేవారు. దీంతో బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలతో ఈటల  ఒక గ్రూపు తయారు చేయిస్తున్నారనే అనుమానం టీఆర్​ఎస్​ హైకమాండ్​కు  కలిగిందని, అటు తర్వాత ఈటల నుంచి ఒక్కొక్కరిని దూరం చేసే పని పెట్టుకుందని జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. చివరికి బొడిగె శోభకు టికెట్ కట్ చేసే వరకు అది వెళ్లిందని, ఆమెకు మద్దతుగా ఈటల వెళ్తే దాన్ని ప్రగతిభవన్ వర్గాలు సహించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత పోరు తీవ్రమైందన్న ప్రచారం ఉంది. ఇటీవల మంత్రి ఈటల.. ‘‘గులాబీ జెండా ఓనర్లం మేమే’’ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులను ఉద్దేశించే ఈటల అలా మాట్లాడారని పార్టీలోని కొందరు నేతలు అంటున్నారు. ఈటలను ఓడించేందుకు గంగుల అనుచరులు కొందరు ప్రయత్నించారని పార్టీలో చర్చ నడుస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో ఈటలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘‘గులాబీ జెండా ఓనర్లం మేమే’’ అని ఈటల మాట్లాడిన తర్వాత ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల కేబినెట్​ విస్తరణలో గంగులకు మంత్రి పదవి వచ్చింది. దీంతో ఒకే జిల్లా నుంచి నాలుగో   మంత్రి అయ్యారు. జిల్లా మంత్రి అయిన కొప్పుల నుంచి బీసీ శాఖను తీసి గంగులకు  కేటాయించారు.

మల్లారెడ్డి వర్గంలో ఆందోళన

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో మంత్రి మల్లారెడ్డి వర్గం ఆందోళనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డికి మంత్రి పదవిని ఏదో తెలియని బలమైన కారణంతో సీఎం కేసీఆ ర్ఇచ్చారని పార్టీ నేతలు చెప్తున్నారు. మొన్నటి వరకు జిల్లాలో ఏపని కావాలన్నా నేతలందరూ మల్లారెడ్డి వద్దకే వెళ్లేవారు. ఇప్పుడు సబితకు మంత్రి పదవి ఇవ్వడంతో జిల్లా రాజకీయాలు మారిపోతున్నాయి. జిల్లాలో మంచి పట్టున్న సబిత తిరిగి మంత్రి కావడంతో ఆమె వర్గం యాక్టివ్​గా మారింది.

వరంగల్లో ఎవరి గ్రూప్వారిదే

ఉమ్మడి వరంగల్ జిల్లాలో  తాజా, మాజీ మంత్రుల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో మంత్రిగా తనకు అవకాశం ఉంటుందని కడియం శ్రీహరి ఆశించారు. కాని సీఎం తన కమ్యూనిటీకి చెందిన ఎర్రబెల్లికి చాన్స్​ ఇచ్చారు. తనకు మంత్రి పదవి రాలేదని ఆవేదనలో కడియం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే ఉన్న వినయ్ భాస్కర్ వర్గం కూడా అసంతృప్తిగా ఉన్నట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది. ‘‘ఉద్యమం మేం చేస్తే.. పదవులు మాత్రం కొత్తగా వచ్చిన వారికి ఎట్లిస్తరు” అంటూ  వినయ్ అనుచరులు నిలదీస్తున్నారు. తొలి ప్రభుత్వంలో కడియం వల్ల.. మలి ప్రభుత్వంలో ఎర్రబెల్లి వల్ల.. తాజా విస్తరణలో సత్యవతి రాథోడ్ వల్ల వినయ్​కు మంత్రి పదవి దక్కలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక కడియంకు, కొత్త మంత్రి సత్యవతి రాథోడ్​కు మంచి సంబంధాలు ఉన్నాయి.  అప్పట్లో టీడీపీలో కడియం, సత్యవతి కలిసి పనిచేశారు. సత్యవతి మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే గతంలో కడియం పేషీలో పనిచేసిన సిబ్బందిని తన పేషీలో నియమించుకున్నారు. రెడ్యానాయక్ తనకంటే జూనియర్​ అయిన సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి ఇవ్వడంపై గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని మూడురోజుల క్రితం కేటీఆర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. పదవులపై మరో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ కూడా స్పందించారు. జిల్లా నుంచి పదవి ఇస్తే సీనియర్​గా తనకే ఇవ్వాలని, నిన్నగాక మొన్నవచ్చినవాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటని ఆయన మీడియా చిట్​చాట్​లో అన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి