హైదరాబాద్ బుడ్డోడు :చదివేది ఏడో తరగతి…సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్

హైదరాబాద్ బుడ్డోడు :చదివేది ఏడో తరగతి…సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్

తన్మయ్ భక్షి.. మూడేళ్ల క్రితం అత్యంత చిన్న వయసులోనే ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించిన బుడతడు. ఐదేళ్ల వయసు నుంచే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టి.. 13 ఏళ్లకు ఐబీఎంలో క్లౌడ్ ఎక్స్‌పర్ట్‌గా జాబ్ కొట్టేసిన బాల మేధావి.

భారత్ నుంచి కెనడా వలస వెళ్లిన ఈ బుడ్డోడిని ఆదర్శంగా తీసుకుని.. నేడు మన హైదరాబాదీ బుడతడు ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. 12 ఏళ్ల వయసులోనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్ జాబ్ సాధించాడు. ఈ బాల మేధావి పేరు పిల్లి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. బడి చదువులైనా పూర్తి చేయకముందే మాంటైగ్నె స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీలో టెకీగా మారిపోయాడు.

గేమ్స్‌ ఆడుతూ.. ఆ ఇంట్రెస్ట్‌తో..

ఇంత చిన్న వయసులోనే ఈ ఘనత ఎలా సాధించావని శ్రీవాస్తవ్‌ని పలకరిస్తే, గేమ్స్ ఆడే ఇంట్రెస్ట్.. తన్మయ్ భక్షి ఇన్‌స్పిరేషన్‌తోనే సాధ్యమైందని చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఆన్‌లైన్ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆడేవాడినని, ఆ ఆసక్తితో తాను ఓ గేమ్ క్రియేట్ చేయాలన్న కోరిక కలిగిందని అంటున్నాడు.

ఇంటర్నెట్ సాయంతోనే కోడింగ్ నేర్చుకుని ఓ గేమ్ క్రియేట్ చేశాడీ బుడతడు. ఆ తర్వాత గొరియన్ టెక్నాలజీపై పట్టు సాధించాడు. తన కొడుకు పట్టుదల చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. కోడింగ్ నేర్చుకోవడానికి సపోర్ట్‌గా నిలిచారు. ఇంత చిన్న వయసులోనే ఈ జాబ్ సాధించానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని చెబుతున్నాడు శ్రీవాస్తవ్.

తన్మయ్ భక్షినే ఆదర్శం..

చిన్న వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించి క్లౌడ్ ఎక్స్‌పర్ట్‌గా జాబ్ కొట్టిన తన్మయ్ భక్షినే తనకు ఆదర్శమని శ్రీవాస్తవ్ తెలిపాడు. పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నది తన లక్ష్యమన్నాడు. పెద్దయ్యాక ఈ సొసైటీకి సాయం చేయాలనుకుంటున్నానని చెబుతున్నాడు.

మూడు రోజులు ఆఫీస్.. రెండ్రోజులు స్కూల్

తన కంపెనీ హానరీ ఎంప్లాయ్‌గా జీతం ఇస్తోందని శ్రీవాస్తవ్ చెప్పాడు. తాను వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు వెళ్తానని, రెండ్రోజులు స్కూల్‌కు వెళ్తానని చెబుతున్నాడు. ఇటు వర్క్.. అటు స్టడీస్ రెండింటినీ  ఎంజాయ్ చేస్తున్నానంటున్నాడీ బుడతడు. ఇప్పుడు వచ్చే ‘హానరోరియం’తో ఉన్నత చదువులకు వెళ్తానని చెబుతున్నాడు సిద్ధార్థ్ శ్రీవాస్తవ్.