- భారీగా పెరుగుతున్న అమ్మకాలు
- డీజిల్ కార్ల సేల్స్ కూడా అంతంతమాత్రమే
న్యూఢిల్లీ: కార్ల విషయంలో కస్టమర్ల టేస్ట్మారుతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లకు దూరం జరుగుతున్నారు. సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్ల కోసం క్యూ కడుతున్నారు. గత నెల కార్ల అమ్మకాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మొత్తం రిటైల్ అమ్మకాల్లో క్లీన్ఎనర్జీ వాహనాల వాటా 42 శాతానికి చేరింది. పెట్రోల్ కార్ల వాటా తొలిసారిగా భారీగా తగ్గింది. గత ఏడాది ఆగస్టులో 46 శాతంగా ఉన్న పెట్రోల్ కార్ల వాటా ఈసారి రికార్డు స్థాయిలో 41 శాతానికి పడిపోయింది.
సీఎన్జీ కార్ల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా పెరిగాయి. వీటి వాటా గత ఆగస్టులో 21 శాతం నుంచి ఈ ఏడాది ఏకంగా 25 శాతానికి ఎగబాకింది. డీజిల్ వాహనాలు కేవలం 17 శాతం వాటాతో సరిపెట్టుకున్నాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 16 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4.01 లక్షల యూనిట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించాయి. వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నప్పటికీ కార్లకు డిమాండ్ తగ్గలేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.
ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ 52 శాతం జంప్
ఎలక్ట్రిక్ వాహన రంగం గత నెల కూడా బలమైన వృద్ధిని సాధించింది. అమ్మకాలు వార్షికంగా 52 శాతం దూసుకుపోయి సుమారు 30,700 యూనిట్లకు చేరాయి. ఈవీ వ్యాప్తి వేగం 7.7 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ రేటు 5.9 శాతమే ఉండేది. జులై నెలలో నమోదైన 8.1 శాతం రికార్డు కంటే ఇది కొద్దిగా తక్కువ అయినప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల చరిత్రలో ఆగస్టు మూడో అత్యుత్తమ నెల.
సీఎన్జీ విభాగంలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఈ సెగ్మెంట్‌లో 71 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. టాటా 17 శాతం వాటాతోనూ, హ్యుందాయ్ 9 శాతం వాటాతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మళ్లీ పుంజుకుంది. దీని వాటా తిరిగి 43 శాతానికి చేరింది. గత ఏడాది డిసెంబర్ తర్వాత ఆ సంస్థ సాధించిన అత్యుత్తమ స్థాయి ఇదే.
ఈవీల వాడకంలో ఢిల్లీ టాప్
ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అత్యధికంగా 19 శాతానికి చేరింది. వీటిలో ఎలక్ట్రిక్ ట్యాక్సీ రిజిస్ట్రేషన్లు కూడా కలిసి ఉన్నాయి. వాస్తవ వినియోగం మాత్రం 12–14 శాతం మధ్య ఉంటోంది. ఈ–20 పెట్రోల్‌పై వ్యతిరేకత, చార్జింగ్ వసతులు మెరుగుపడటం, కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడల్స్ రావడంతో క్లీన్ఎనర్జీ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. కార్లతో పాటు ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ల అమ్మకాలు బాగున్నాయి. ఎలక్ట్రిక్ ఆటోల అమ్మకాలు 65 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ బస్సులు సైతం ఆగస్టులో అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించాయి.
