ఎలక్షన్ కమిషన్ లెటర్పై బీజేపీ సీల్.. కేరళలో రాజకీయ దుమారం..!

ఎలక్షన్ కమిషన్ లెటర్పై బీజేపీ సీల్.. కేరళలో రాజకీయ దుమారం..!

కేరళలో రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల సంఘం అధికారిక లెటర్ పై బీజేపీ సీల్ (ముద్ర) ఉండటం సంచలనంగా మారింది. ఈసీ లెటర్ పై బీజేపీ సీల్ ఎలా ఉంటుందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారో చెప్పేందుకు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ పరిణామం ఎన్నికల సంఘాన్ని తీవ్ర వివాదంలోకి నెట్టేసింది. మార్చి 19, 2019 తేదీతో ఉన్న ఒక ఎన్నికల సంఘం లేఖపై... భారతీయ జనతా పార్టీ కేరళ యూనిట్ సీల్  ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను ఎన్నికల సంఘం ఇటీవలే అన్ని రాజకీయ పార్టీలకు పంపించింది. ఈసీ అధికారిక లేఖపై బీజేపీ సీల్ ఏంటని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. 

కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) పార్టీలు ఈ వ్యవహారంపై తీవ్రంగా విమర్శించాయి. ‘బీజేపీ సీల్ ఎన్నికల సంఘం లేఖపై ఎలా వచ్చింది?  ఇప్పటికైనా  ముసుగులు తీసేశారా? ఎన్నికల సంఘం, బీజేపీ ఇద్దరూ ఒకే సీల్ ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తోంది.. అంటూ సీపీఐ(ఎం) వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏ.వి. గోవిందన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  

ఎన్నికల సంఘం లెటర్ పై పార్టీ సీల్ ఉండటం ఇదే తొలిసారి. ఈవీఎం మెషీన్ పై ఏ బటన్ నొక్కినా బీజేపీకే పడుతుందని చాలా వరకు వింటున్నాం. కానీ బీజేపీ, ఎన్నికల సంఘం ఒకే సీల్ ను వినియోగిస్తున్నట్లు చూడటం ఇది మొదటి సారి.. అంటూ ట్వీట్ చేశారు. 

మీరు ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఆఫీసు నుంచి నడుపుతున్నారా? వారి సీల్ మీకు ఎలా వచ్చింది? అంటూ కాంగ్రెస్ కూడా ప్రశ్నించింది. ఎన్నికల సంఘం లెటర్ ను సీల్ వేసి  బీజేపీ ఎన్నికల అధికారులకు పంపుతుందా.. అంటూ కాంగ్రెస్ విమర్శించింది. 

ఎన్నికల సంఘం క్లారిటీ:

ఎన్నికల సంఘం దీన్ని 'ప్యూర్ క్లెరికల్ ఎర్రర్' అంటూ వివరణ ఇచ్చింది. బీజేపీ అందించిన 2019 డాక్యుమెంట్ ఫోటోకాపీలో ఇప్పటికే ఆ పార్టీ సీల్ ఉండటం గమనించకుండా, దాన్ని ఇతర పార్టీలకు సర్క్యులేట్ చేయడం జరిగిందని చెప్పింది. లోపం గుర్తించగానే సరిచేశామని, ఆ లేఖను ఉపసంహరించుకున్నామని తెలిపింది. ఈ ఫైల్‌ను నిర్వహించిన అసిస్టెంట్ సెక్షన్ అధికారిని సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.