- వాతావరణ సమాచారంతో సాగు నిర్ణయాలు తీసుకునే అవకాశం
- వెదర్ డేటా సేకరణలో తెలంగాణ దేశంలోనే ముందంజ
- గ్రామీణ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు
- జాతీయ సదస్సులో నిపుణుల అభిప్రాయాలు
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో క్లైమేట్ ఇంటెలిజెన్స్ కీలక మార్పులు తీసుకురానుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను ముందే అంచనా వేస్తే పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఏఐ, అధునాతన వాతావరణ అంచనా టెక్నాలజీతో రైతులకు మేలు జరగడంతో పాటు గ్రామీణ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
3కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని హార్టికల్చర్ కాలేజీలో 'క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్, అగ్రిబిజినెస్ మోడలింగ్'పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్నినో, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని సూచించారు.
స్థానిక వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేస్తే సాగు నిర్ణయాలు సులభమవుతాయని, పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. తెలంగాణ డిజిటల్ క్రాప్ డేటాబేస్లో 55 లక్షల మందికి పైగా రైతుల వివరాలు ఉన్నాయని వివరించారు.
ఆరు కిలోమీటర్ల స్థాయికి అంచనాలు..
వాతావరణ అంచనాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఔట్రీచ్ విభాగం అధిపతి డాక్టర్ జె.వి. సింగ్ తెలిపారు. గతంలో 150 కిలోమీటర్ల పరిధిలో అంచనాలు ఇచ్చే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆరు కిలోమీటర్ల స్థాయికి చేరుకున్నామని చెప్పారు.
క్షేత్రస్థాయికి టెక్నాలజీ..
ఏఐతో వాతావరణ అంచనాలు మరింత కచ్చితంగా మారుతున్నాయని హార్టికల్చర్ వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ఈ సమాచారాన్ని రైతులకు ఉపయోగకరమైన సలహాలుగా అందించడంతో పాటు అగ్రిబిజినెస్కు అనుసంధానించాలని సూచించారు. సదస్సులో 'క్లైమేట్ అనలిటిక్స్', 'క్లైమేట్ ఇంటెలిజెన్స్' పుస్తకాలను ఆవిష్కరించారు.
