ఆయుర్వేద క్లినికల్ ట్రయల్స్‌ను ఉమ్మడిగా చేయనున్న అమెరికా, ఇండియా

ఆయుర్వేద క్లినికల్ ట్రయల్స్‌ను ఉమ్మడిగా చేయనున్న అమెరికా, ఇండియా

వాషింగ్టన్: కరోనా మహమ్మారికి విరుగుడుగా ఆయుర్వేద సూత్రీకరణలను కనుగొనే యత్నంలో అగ్రరాజ్యం అమెరికా, ఇండియాలు సంయుక్తంగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాలకు చెందిన ఆయుర్వేద అభ్యాసకులు, పరిశోధకులు కలసి పని చేయనున్నారని ఇండియా రాయబారి చెప్పారు. ఇండో–అమెరికన్ సైంటిస్టులు, డాక్టర్స్‌తో బుధవారం అమెరికాలో ఇండియా రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ సమావేశం అయ్యారు. కరోనాపై పోరులో ఇరు దేశాలు భారీ స్థాయిలో ఉన్న తమ సైంటిస్టులు, డాక్టర్లను కలుపుకొని ముందుకెళ్లనున్నట్లు సంధూ తెలిపారు.

‘ఉమ్మడిగా పరిశోధనలు, బోధనతోపాటు ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్‌ ద్వారా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయాలని మా ఇన్‌స్టిట్యూషన్స్ సంయుక్తంగా నిర్ణయించాయి. కరోనాకు ఫార్ములేషన్స్‌ కనుగొనడానికి అమెరికా, ఇండియాలకు చెందిన రీసెర్చర్స్‌, ప్రాక్టీషనర్స్ ఉమ్మడిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా మా సైంటిస్టులు తమ జ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటున్నారు. తక్కువ ధరలకే మెడిసిన్స్, వ్యాక్సిన్స్‌ ఉత్పత్తి చేస్తాయని ఇండియన్ ఫార్మా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కరోనాపై పోరులో కీలక పాత్ర పోషించడానికి మేం శాయశక్తులా యత్నిస్తున్నాం’ అని సంధూ పేర్కొన్నారు.