మూతపడ్డ సర్కారు స్కూళ్లు తెరుచుకుంటున్నయ్‌‌

మూతపడ్డ సర్కారు స్కూళ్లు తెరుచుకుంటున్నయ్‌‌
  • ఈ ఏడాది 22 జిల్లాల్లో వంద స్కూళ్ల వరకు రీ ఓపెన్ 
  • ఆయా బడుల్లో సుమారు 1,800 మంది స్టూడెంట్ల చేరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కారణాలతో మూతపడ్డ సర్కారీ స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ ఏడాది ఏకంగా వంద వరకూ స్కూళ్లు రీఓపెన్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 1,201 స్కూళ్లలో జీరో ఎన్‌‌రోల్‌‌మెంట్ నమోదైంది. వీటిలో 1,179 ప్రైమరీ స్కూళ్లే ఉన్నాయి. కరోనా తీవ్రత, ప్రైవేట్‌‌ బడుల్లో ఫీజుల భారం తదితర కారణాలతో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు ప్రయారిటీ పెరిగింది. దీంతో వివిధ ప్రాంతాల్లో మూతపడ్డ స్కూళ్లలో మళ్లీ స్టూడెంట్లు చేరుతున్నారు. ఈ నెల మొదటి వారం వరకు 22 జిల్లాలో 98 స్కూళ్లు రీ ఓపెన్ అయినట్టు అధికారులు చెప్పారు. ఈ వారం రోజుల్లో మరో ఐదారు స్కూళ్లు ఓపెనై ఉంటాయని చెబుతున్నారు. స్కూళ్లలో 1,800 మంది వరకు స్టూడెంట్లు చేరినట్లు చెప్పారు. అధికంగా వరంగల్‌‌ జిల్లాలో 12 స్కూళ్లు, హనుమకొండ, మహబూబ్‌‌నగర్ జిల్లాలో 9 స్కూళ్ల చొప్పున రీ ఓపెన్ అయ్యాయి. పెద్దపల్లి, నారాయణపేట, ఖమ్మం, సిద్దిపేట, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ తెరుచుకున్నాయి. వీటిల్లో చేరిన స్టూడెంట్లు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ల నుంచి వారే ఉన్నారని టీచర్లు చెబుతున్నారు.