ఉప్పల్‌‌‌‌లో టీ20 ఇయ్యాల్నే

ఉప్పల్‌‌‌‌లో టీ20 ఇయ్యాల్నే
  • సిరీస్‌‌‌‌ కైవసం చేసుకోవాలని ఇరు జట్ల ఆరాటం
  • మూడేళ్ల తర్వాత సిటీ ఆతిథ్యం ఇస్తున్న  మ్యాచ్‌‌పై ఫ్యాన్స్​ ఆసక్తి
  • రా. 7 నుంచి స్టార్​స్పోర్ట్స్​లో లైవ్​

మూడేండ్ల తర్వాత  ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌ రెడీ అయింది. ఉప్పల్​స్టేడియంలో ఇయ్యాల రాత్రి ఇండియా– ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌‌‌‌ జరగనుంది.ఈ పోరు కోసం ఇరు జట్లూ శనివారం సాయంత్రం సిటీకి వచ్చి తమకు కేటాయించిన హోటల్స్‌‌‌‌కు చేరుకున్నాయి. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ఇరు జట్లూ చెరోటి నెగ్గాయి. హైదరాబాద్‌‌‌‌లో గెలిచిన జట్టు సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకోనుంది. ఉప్పల్‌‌‌‌లో చివరగా 2019లో ఇండియా, వెస్టిండీస్‌‌‌‌ మధ్య మ్యాచ్‌‌‌‌ జరిగింది. ఆ తర్వాత కరోనా వల్ల ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు కూడా హైదరాబాద్‌‌‌‌కు రాలేదు. దాంతో, ఇండియా–ఆసీస్‌‌‌‌ టీ20 కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌‌‌‌ టికెట్లకు భారీ డిమాండ్‌‌‌‌ ఏర్పడింది. కానీ, హెచ్‌‌‌‌సీఏ కొన్ని టికెట్లనే సాధారణ ఫ్యాన్స్‌‌‌‌కు అందుబాటులో ఉంచి విమర్శలు ఎదుర్కొంది. స్టేడియం కెపాసిటీ 39 వేలు కాగా.. 26,500 టికెట్లు అమ్మినట్టు చెప్పింది. మిగిలిన 12వేల పైచిలుకు టికెట్ల లెక్క తేలలేదు. మరోవైపు తమ అభిమాన క్రికెటర్లను గ్రౌండ్‌‌‌‌లో చూసేందుకు ఎలాగైనా టికెట్లు సంపాదించాలని ఫ్యాన్స్‌‌‌‌  చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. మూడు, నాలుగు రెట్లు పెట్టి బ్లాక్​లో కొనేందుకూ సిద్ధమవుతున్నారు.

ఆదివారం. ఆహ్లాదకరమైన వాతావరణం. అద్భుత స్టేడియం.  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్లతో కూడిన  రెండు పెద్ద జట్ల మధ్య టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌!  పైగా సిరీస్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ను తేల్చే పోరు..! అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌‌‌‌‌ కోసం మూడేళ్లుగా  ఎదురు చూస్తున్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అభిమానులు ఆస్వాదించడానికి ఇంతకంటే గొప్ప పోరు ఇంకేముంటుంది..!  ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో ఇండియా–ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్​ నేడే! సిరీస్​ విజేతను తేల్చేది కావడంతో ఈ మ్యాచ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  భాగ్యనగరంలో  టీమిండియా తమ తడాఖా చూపెట్టి సిరీస్‌‌‌‌‌‌‌‌ పట్టేయాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు..! టికెట్ల కోసం ఇక్కట్లు పడి, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ తీరుతో నిరాశలో ఉన్న  హైదరాబాదీలకు ఇరు జట్లూ  తమ ఆటతో కిక్​ ఇవ్వాలని అంతా ఆశిస్తున్నారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: భాగ్యనగర క్రికెట్‌‌‌‌ అభిమానుల కేరింతల నడుమ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌కు సూపర్ ఫినిషింగ్‌‌‌‌ ఇచ్చేందుకు టీమిండియా రెడీ అయింది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా ఇక్కడి ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో ఆదివారం చివరి పోరు జరగనుంది. చెరో మ్యాచ్‌‌‌‌ నెగ్గిన ఇరు జట్లూ 1–1తో సమంగా ఉండగా.. ఉప్పల్‌‌‌‌లో గెలిచిన జట్టు  సిరీస్‌‌‌‌  కైవసం చేసుకుంటుంది. దాంతో, ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది. మొహాలీలో  తొలి మ్యాచ్‌‌‌‌లో భారీ స్కోరును కాపాడుకోలేకపోయినా.. రోహిత్‌‌‌‌ శర్మ ధనాధన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌తో నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో ఎనిమిది ఓవర్ల పోరులో గెలిచిన టీమిండియా సిరీస్‌‌‌‌ ఆశల సజీవంగా నిలుపుకోగలిగింది. కానీ, రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనూ మన బౌలర్లు పెద్దగా ఆకట్టుకో లేకపోయారు. సిరీస్‌‌‌‌ నెగ్గాలంటే బౌలర్లు మెరుగవ్వాలి.  టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌  సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా యంగ్‌‌‌‌ పేసర్‌‌‌‌ హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌, యుజ్వేంద్ర చహల్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌ అక్షర్ పటేల్‌‌‌‌ తన రెండు ఓవర్ల స్పెల్‌‌‌‌లో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో ఇండియాకు మంచి ఆరంభం దక్కినా.. చివర్లో మన బౌలర్లు  మళ్లీ ఇబ్బంది పడ్డారు. గాయం నుంచి కోలుకున్న  జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా గత పోరులో తన మార్కు యార్కర్లతో ఆసీస్‌‌‌‌ బ్యాటర్లను వణికించడం పాజిటివ్‌‌‌‌ అంశం. కానీ, సీనియర్‌‌‌‌ పేసర్‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌ డెత్‌‌‌‌ ఓవర్లలో నిరాశ పరుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా డెత్‌‌‌‌ ఓవర్లలో యార్కర్లు, నకుల్‌‌‌‌ బాల్స్‌‌‌‌తో బ్యాటర్లను కట్టడి చేసే భువీ.. ఆసియా కప్‌‌‌‌తో పాటు తొలి టీ20లో ఫెయిలయ్యాడు. ఎనిమిది ఓవర్ల రెండో టీ20లో నలుగురు బౌలర్లే అవసరం అని రోహిత్‌‌‌‌ భావించడంతో భువీని పక్కనపెట్టారు. కానీ, వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో బుమ్రాతో కలిసి పేస్‌‌‌‌ బాధ్యతలు తీసుకోవాల్సిన అతను తక్షణమే ఫామ్‌‌‌‌ అందుకోవాలి. మిడిల్‌‌‌‌ ఓవర్లలో ఇండియా స్పిన్నర్లపైనే ఆధారపడుతుండగా.. అక్షర్‌‌‌‌  పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో పాటు వికెట్లు రాబడుతూ సత్తా చాటుతున్నాడు. కానీ, చహల్‌‌‌‌ ఏమాత్రం అకట్టుకోవడం లేదు. ఆసియాకప్‌‌‌‌తో పాటు ఆసీస్‌‌‌‌పై ఎక్కువ రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నాడు. చహల్‌‌‌‌ తన మార్కు చూపకపోతే టీమ్‌‌‌‌లో తన ప్లేస్‌‌‌‌ను కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. 

కోహ్లీకి లక్కీ గ్రౌండ్‌‌‌‌

తొలి మ్యాచ్‌‌‌‌లో కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, రెండో మ్యాచ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ శర్మ బ్యాట్‌‌‌‌ ఝుళిపించి ఫామ్‌‌‌‌ అందుకున్నారు. ఈ ఇద్దరితో పాటు విరాట్‌‌‌‌ కోహ్లీ మరింత నిలకడ చూపెట్టాల్సిన అవసరం ఉంది. గత రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఫెయిలైన విరాట్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. పైగా, ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో విరాట్‌‌‌‌కు మంచి రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్లలో ఇక్కడ ఆడిన 10 మ్యాచ్‌‌‌‌ల్లో అతను 53.62 సగటు, 139.73 స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌తో మెప్పించాడు. 2019లో చివరగా వెస్టిండీస్‌‌‌‌పై 50 బాల్స్‌‌‌‌లోనే 94 రన్స్‌‌‌‌ బాదాడు. భాగ్యనగర అభిమానులు అతడి నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్‌‌‌‌ ఆశిస్తున్నారు. తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌ ఆడిన సూర్యకుమార్‌‌‌‌ అదే జోరు కొనసాగిస్తే బాగుంటుంది. ఆసియాకప్‌‌‌‌ తర్వాత హార్దిక్‌‌‌‌ కూడా ఫామ్‌‌‌‌ అందుకోవడం ప్లస్‌‌‌‌ పాయింట్‌‌‌‌. గత మ్యాచ్‌‌‌‌ను తనదైన స్టయిల్లో ఫినిష్‌‌‌‌ చేసిన దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ అదే జోరుకొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. టీమ్‌‌‌‌లో ఏకైక లెఫ్టార్మ్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌, స్పిన్నర్‌‌‌‌గా అక్షర్‌‌‌‌పై పెద్ద బాధ్యతే ఉంది.   అయితే, ఇండియా బ్యాటర్లు లెగ్‌‌‌‌ స్పిన్‌‌‌‌ను ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ వీక్‌‌‌‌నెస్‌‌‌‌ను ఆసీస్‌‌‌‌ లెగ్గీ ఆడమ్‌‌‌‌ జంపా ఉపయోగించుకుంటున్నాడు. సిరీస్‌‌‌‌ డిసైడర్‌‌‌‌ కావడంతో బ్యాటర్లు జంపా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక, గత మ్యాచ్‌‌‌‌లో పక్కనబెట్టిన భువనేశ్వర్‌‌‌‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది. అలాగే, చహల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ రావొచ్చు. 

ఆసీస్‌‌‌‌ కూడా బౌలింగ్‌‌‌‌పైనే

ఇండియా మాదిరిగా ఆస్ట్రేలియా కూడా బౌలింగ్‌‌‌‌ను మెరుగు పరుచుకోవడంపైనే దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్‌‌‌‌లో భారీ టార్గెట్‌‌‌‌ను కరిగించిన కంగారూ టీమ్‌‌‌‌ రెండో  పోరులో బౌలింగ్‌‌‌‌ వైఫల్యంతో దెబ్బతిన్నది. ఆసీస్‌‌‌‌ బౌలర్లు.. ఇండియన్స్‌‌‌‌కు భారీ సిక్సర్లు ఇచ్చుకున్నారు. 8 ఓవర్లలో ఫించ్‌‌‌‌, వేడ్‌‌‌‌ మంచి స్కోరే అందించినా.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు. స్పిన్నర్‌‌‌‌ జంపా రాణిస్తున్నా.. పేసర్లు కమిన్స్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌, సామ్స్‌‌‌‌ ఓవర్‌‌‌‌కు 11 ప్లస్‌‌‌‌ రన్స్‌‌‌‌ ఇచ్చారు. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కామెరూన్‌‌‌‌ సైతం రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌ చేశాడు. అయితే, బ్యాటింగ్‌‌‌‌లో మాత్రం కంగారూలు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కీపర్‌‌‌‌ వేడ్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫామ్​లో ఉన్నాడు. మరో హిట్టర్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ కూడా పుంజుకోవాలని ఆసీస్‌‌‌‌ కోరుకుంటోంది. ఈ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ మళ్లీ ఏడుగురు బ్యాటర్ల స్ట్రాటజీకి వెళ్తే జోష్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌ తిరిగి తుది జట్టులోకి వస్తాడు.  గాయపడ్డ నేథన్‌‌‌‌ ఇలిస్‌‌‌‌ కోలుకుంటే సీన్‌‌‌‌ అబాట్‌‌‌‌, సామ్స్‌‌‌‌ చోటు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక, ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌‌‌‌లు ఆడుతున్న నేపథ్యంలో పేసర్లు కమిన్స్‌‌‌‌, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌లో ఒకరికి రెస్ట్‌‌‌‌ ఇచ్చే అవకాశం ఉంది. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రాహుల్‌‌‌‌, కోహ్లీ, సూర్య, పాండ్యా, కార్తీక్‌‌‌‌ (కీపర్‌‌‌‌), అక్షర్‌‌‌‌, హర్షల్‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌, బుమ్రా, చహల్‌‌‌‌/అశ్విన్‌‌‌‌.
ఆస్ట్రేలియా: ఫించ్‌‌‌‌ (కెప్టెన్),  గ్రీన్‌‌‌‌, స్మిత్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, ఇంగ్లిస్‌‌‌‌, డేవిడ్‌‌‌‌, వేడ్‌‌‌‌ (కీపర్), కమిన్స్‌‌‌‌, ఎలిస్‌‌‌‌/అబాట్‌‌‌‌, జంపా, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌/సామ్స్‌‌‌‌.

మరోసారి పరుగుల పండుగ పక్కా

మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌లో ఓ మ్యాచ్‌‌‌‌ జరుగుతోంది. 2019 తర్వాత ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు కూడా ఉప్పల్‌‌‌‌ ఆతిథ్యం ఇవ్వలేదు. వెస్టిండీస్‌‌‌‌తో జరిగిన టీ20లో పరుగుల మోత మోగింది. సాధారణంగా ఇక్కడి పిచ్‌‌‌‌ బ్యాటర్లకు అనుకూలం. బౌలర్లకు కూడా ఎంతో కొంత సపోర్ట్‌‌‌‌ ఇస్తుంది. ఈ సారి కూడా క్యురేటర్‌‌‌‌ చంద్రశేఖర్ అలాంటి పిచ్‌‌‌‌నే తయారు చేశాడు. వికెట్‌‌‌‌పై గ్రాస్‌‌‌‌ లేదు కాబట్టి మరోసారి పరుగుల పండుగ ఖాయమే. పైగా, బౌండ్రీ లైన్స్‌‌‌‌ కూడా కాస్త దగ్గరకి చేశారు. ఉప్పల్‌‌‌‌లో టాస్‌‌‌‌ ప్రభావం పెద్దగా ఉండదు. ఇక్కడ జరిగిన 16 మ్యాచ్‌‌‌‌ల్లో ఎనిమిదిసార్లు ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన జట్లు గెలిచాయి. ఇక, ఆదివారం ఆకాశం కాస్త మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం సాయంత్రమే పిచ్‌‌‌‌, ఔట్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గాలులు వస్తే అవి ఎగిరిపోకుండా.. పెద్ద పెద్ద టైర్లు, ఇతర బరువులు కూడా పెట్టారు. కొద్దిపాటి వర్షం వచ్చినా.. మ్యాచ్‌‌‌‌ టైమ్‌‌‌‌కు  గ్రౌండ్‌‌‌‌ను సిద్ధం చేస్తామని క్యురేటర్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌ చెప్పాడు.