డ్రాప్​ బాక్స్​ లో లేఆఫ్స్ : ఏఐ వైపు మారుతున్న కంపెనీ

డ్రాప్​ బాక్స్​ లో లేఆఫ్స్ : ఏఐ వైపు మారుతున్న కంపెనీ

ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్  ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ట్విట్టర్ , మెటా, అమెజాన్ వంటి సంస్థల్లో ఆందోళకర స్థాయిలో ఈ తొలగింపు జరుగుతుండగా.. మరికొన్ని కంపెనీలు కూడా ఆ దారిలోనే నడుస్తున్నాయి. ఇప్పడు తాజాగా ఆ జాబితాలో క్లౌడ్​ స్టోరేజ్​ దిగ్గజం డ్రాప్​ బాక్స్​ చేరింది. క్లౌడ్ స్టోరేజీ దిగ్గజం డ్రాప్​ బాక్స్​  16 శాతం మంది ఉద్యోగులను ( 500 మందిని) తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపారం లాభదాయకంగా ఉన్నప్పటికీ,  వృద్ధి మందగించడం వలన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఈఓ డ్రూ హ్యూస్టన్  తెలిపారు . ఆర్థిక మాంద్యం తట్టుకోవడానికి కస్టమర్ లపై డ్రాప్​ బాక్స్ ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా, సానుకూల రాబడిని అందించడానికి ఉపయోగించే కొన్ని పెట్టుబడులు ఇకపై నిలకడగా ఉండవని కంపెనీ తెలిపింది

16 వారాల జీతం

ప్రభావిత ఉద్యోగులకు 16 వారాల వేతనంఇస్తామన్నారు. డ్రాప్​ బాక్స్ లో పదవీకాలంపూర్తయిన ప్రతిసంవత్సరానికి ఒక అదనపు వారం వేతనం కూడా అందిస్తామన్నారు.  తొలగించిన ఉద్యోగులు  వారి క్యూ2 ఈక్విటీ వెస్ట్ ను  అందుకుంటారు.  USలో ఆరు నెలల వరకు కోబ్రాకు అర్హులవుతారని కంపెనీ తెలిపింది. ఉద్యోగులు తమ వద్దనే  కంపెనీ పరికరాలను (ఫోన్ లు , టాబ్లెట్ లు , ల్యాప్ టాప్ లు మరియు పెరిఫెరల్స్) ఉంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. AI యుగంలో ముందంజలో ఉండటానికి డ్రాప్ బాక్స్ కట్టుబడి ఉందంటూ..  ఉత్తమమైన స్థితిలో ఉందని నిర్ధారించుకోవాలని హ్యూస్టన్ చెప్పారు.  ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తన శక్తి మేరకు అంతా చేస్తానని హామీ ఇచ్చారు.  ఉద్యోగుల  భవిష్యత్తు ప్రణాళికలను మరింత వివరంగా చర్చించడానికి ప్రాంతీయ టౌన్ హాల్స్ ను నిర్వహించనున్నారు.

కొత్త ఉద్యోగాలు లేవు ..

ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు కంపెనీలు దారులు వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా, మరికొన్ని కంపెనీలు కొత్తగా నియామకాలను నిలిపివేస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఇస్తున్న బోనస్ లు, ఇతర ప్రయోజనాలకూ కోత పెడుతున్నాయి.

ఎందుకీ దుస్థితి ?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదలవుతున్న మ్యాందం ప్రభావం ఉద్యోగులపై పడుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా కార్పొరేట్లు నిధులను సమీకరించలేక పోతున్నారని, అందుకే కంపెనీలకు ఉద్యోగుల తొలగింపే మార్గంగా కనిపిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. అయితే పరిస్థితులు చక్కబడితే మళ్లీ నియామకాలు జరుగవచ్చంటున్నారు.

మొత్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డు కాలం నడుస్తోంది. టెక్ ఉద్యోగులు బాగా టెన్షన్ పడుతున్నారు. ఏ క్షణం ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉండటం టెన్షన్ పెడుతోంది. భారత్ లో ఈ ఏడాది తొలి 15 రోజుల్లోనే 91 టెక్ కంపెనీలు 24వేల మంది ఉద్యోగులను తొలగించేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచమంతా మళ్లీ ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తోందన్న వరల్డ్ బ్యాంక్ హెచ్చరికలే ఇందుకు కారణమని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.