న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఆయన సేవల్ని పార్టీ వాడుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి గౌరవ కాంగ్రెస్ శాసన సభ్యుడని, ఆయన మనస్తాపానికి గురై ఉంటే అన్ని విషయాలు మాట్లాడి, పార్టీలోనే ఉండేలా చూస్తామని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై చర్చించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తో 3గంటలు కూర్చొని తాను మాట్లాడానని చెప్పారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ అంటే గౌరవం ఉందని, ఏ విషయంలో అయినా ఇబ్బంది ఉంటే మాట్లాడి పార్టీలోనే కొనసాగేలా చేయాలని తాము నిర్ణయించామని తెలిపారు. అదే దిశలో ఆలోచిస్తానని రాజగోపాల్ కూడా చెప్పారని భట్టి వెల్లడించారు.
మేము టైమ్‌వేస్ట్ చేసుకోం..
కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారంటూ బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. సంజయ్ ఒక ఉన్మాది అని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉందనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ టైమ్‌వేస్ట్ చేసుకోదన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెడతామని అన్నారు. దాదాపు రూ.5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కేసీఆర్ తాకట్టుపెట్టారని ఆయన విమర్శించారు.
