ప్రభుత్వ ఆస్పత్రులపై గవర్నర్ ను కలుస్తాం

ప్రభుత్వ ఆస్పత్రులపై గవర్నర్ ను కలుస్తాం

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేవ‌ని, స‌రిపోను సిబ్బంది లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఇప్పుడున్న అరకొర సిబ్బంది మాత్రమే రేయింబ‌వ‌ళ్లు పని చేస్తున్నారని, వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ‌త నెల ఆగస్టు 26 నుంచి త‌మ పార్టీ ఎమ్మెల్యేలు క‌ల‌సి ప్రభుత్వ ఆసుపత్రుల ను సందర్శించామ‌ని ఆయ‌న అన్నారు.

ఉమ్మడి రాష్ట్రం లో నిర్మించిన ఆసుపత్రులే త‌ప్ప‌.. ఆరున్నర ఏండ్ల‌లో కొత్తగా ఒక్క ఆసుపత్రిని కూడా TRS ప్రభుత్వం కట్టలేదన్నారు భ‌ట్టి. ఆరున్నర ఏండ్ల నుంచి ప్రభుత్వం గాడిద‌లు కాస్తుందా? అని ఘాటుగా ప్ర‌శ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని అబద్ధాలే చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఈటల రాజేందర్ ను ఉత్సవ విగ్రహంగా పెట్టాడన్నారు.

పేద ప్రజలు కరోనా తో ఇబ్బందులు పడుతున్నారని, ఐషోలేషన్ ఏర్పాటు చేయక‌పోవ‌డం వ‌ల్ల గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. యశోద లాంటి ప్రైవేట్ ఆసుపత్రులు జలగల‌ మాదిరిగా ప్రజల రక్తం తాగుతుంటే ప్ర‌భుత్వం ఎందుకు ఆపలేకపోతున్న‌ద‌ని భ‌ట్టి ప్ర‌శ్నించారు. అధికారుల కమిటీ వేసి అడ్డుకోవాలని అన్నారు

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంద‌ని, ప్రభుత్వ ఆస్పత్రులపై గవర్నర్ ను కలుస్తామ‌ని అన్నారు భ‌ట్టి.
ప్రభుత్వం స్పందించకుంటే కోర్ట్ కు కూడా వెళ్తామ‌న్నారు. వచ్చే శాసనసభలో ప్రభుత్వ ఆసుపత్రులపైన చర్చించాలని కోరుతామ‌న్నారు. అవసరమైతే స్పీకర్ ను కలుస్తామ‌ని చెప్పారు.