దొరల దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం: బట్టి విక్రమార్క

దొరల దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం: బట్టి విక్రమార్క

దొరల దోపిడీ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. మే 15వ తేదీ సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో బట్టి పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా తొండపల్లి, చిట్యాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. "పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టు సంబంధించి రిజార్వాయిర్ ను పరిశీలిస్తాం.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చంపిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు అందిస్తానన్నడు. ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈ ప్రాంతంలో ఓట్లు అడగడానికి రానన్నాడు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటినా ఈ నాటి వరకు ఒక్క ఎకరం సేకరించలే..రిజర్వాయర్ పనులు ప్రారంభించలేదు" అని బట్టి పేర్కొన్నారు.

కేసీఆర్ పాలన వల్ల కృష్ణా నది నీళ్ళను ఈ ప్రాంతానికి తెచ్చుకోలేకపోయామన్నారు బట్టి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరాలంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అడ్డు తొలగించుకోవాలని సూచించారు. కావాలని నది జలాలపై ఒకరకమైన భావజాలం సృష్టించిన కేసీఆర్.. కేవలం ఓట్ల రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంటే..అభివృద్ధి జరగకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నాడని బట్టి మండిపడ్డారు. పంపిణీ చేసిన పేదల భూములను వెనక్కు తీసుకోవడానికి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. మా భూములు మాకే...మా నీళ్ళు మాకే అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నేరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని  బట్టి విక్రమార్క తెలిపారు.