
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్..అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. రివర్స్ పంపింగ్ ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారని..అయినా చుక్క నీరు కూడా SRSPలోకి రాలేదన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని నాగపూర్ లో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీ డిజైన్ పేరుతో మార్చారని మండి పడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 7 జిల్లాలకు మంచి నీరు, పరిశ్రమలకు నీటి సదుపాయంతో సహా 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని విక్రమార్క వెల్లడించారు.