కేబినెట్ నిర్ణయాలపై మాటల్లేవ్.. ప్రెస్ నోట్లే

కేబినెట్ నిర్ణయాలపై మాటల్లేవ్.. ప్రెస్ నోట్లే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ తీర్మానాలు, ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను వెల్లడించేందుకు సీఎం, మంత్రులు మీడియా ముందుకురావడం లేదు. కేవలం ప్రెస్‌‌నోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారు. కేబినెట్ భేటీ జరిగిన రోజున.. లాక్​ డౌన్ లాంటి అత్యంత కీలకమైన నిర్ణయాలు అమలు చేసేటప్పుడు ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇలాంటి సందర్భాల్లో సీఎం లేదా సీనియర్ మంత్రులు, ఐ అండ్ పీఆర్ మినిస్టర్.. మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే ఆనవాయితీ ఉమ్మడి రాష్ట్రం నుంచి అమల్లో ఉండేది. ఇప్పుడు ఐ అండ్ పీఆర్ శాఖ సీఎం దగ్గరే ఉంది. కానీ సీఎంతోపాటు మంత్రులందరూ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఫస్ట్ వేవ్​లో హడావుడి

కరోనా ఫస్ట్ వేవ్ టైమ్‌‌లో పలుమార్లు ప్రెస్‌‌మీట్లు పెట్టి కరోనాను కట్టడి చేసే చర్యలపై సీఎం కేసీఆర్ హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత ప్రెస్​మీట్లు పెట్టలేదు. దుబ్బాక బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎలక్షన్, సాగర్ బై ఎలక్షన్ సందర్భంగా సీఎం నాలుగు సార్లు పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ చేశారు. జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నిరుడు మే నెలలో కరోనా ఫస్ట్ వేవ్, లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో ప్రగతి భవన్‌‌లో చివరి సారిగా ఆయన ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. తర్వాత నాలుగు సార్లు కేబినెట్ భేటీ జరిగింది. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. మొన్న వైరస్ సోకటంతో సీఎం కేసీఆర్ రెండు వారాలు ఐసోలేషన్​లో ఉన్నారు. తర్వాతి నుంచి రివ్యూలు, వరుసగా మూడు కేబినెట్ భేటీలు నిర్వహించిన ఆయన.. మీడియాకు దూరంగా ఉంటున్నారు. సీఎం ఆదేశాలతో ఆఫీసర్లతో జరిగే రివ్యూలు, కేబినెట్ మీటింగ్​లకు అటెండైన మినిస్టర్లు పెదవి విప్పటం లేదు. ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చేటప్పుడో, వెళ్లేటప్పుడో మీడియా పలకరించినా.. తమకేం తెలియనట్లుగా అన్నింటినీ దాటవేస్తున్నారు.

మొన్న కూడా ఇంతే..

మే 30న జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాసేపటికి సీఎంవో నుంచి ప్రెస్‌‌నోట్ రిలీజైంది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినేట్ భేటీ 9 గంటల పాటు కొనసాగింది. ఈ మీటింగ్‌‌లో లాక్​డౌన్​తోపాటు కరోనాను కట్టడి చేసే చర్యలు, ఉద్యోగులకు పీఆర్సీ వేతనాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈసారి కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రులెవరూ వెల్లడించలేదు. లాక్‌‌డౌన్ సడలింపు, మరో పది రోజుల పొడిగింపు, పెండింగ్​లో ఉన్న రేషన్ కార్డుల జారీ, తొమ్మిది జిల్లాల్లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు, రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి తదితర అంశాలపై.. యథావిధిగా సీఎం కార్యాలయం ప్రెస్‌‌నోట్‌‌తో సరిపెట్టింది.