
- పోటీలు ముగిసి 16 రోజులైనా అందని ప్రైజ్‌మనీ
- 713 మందికి అందాల్సినవి రూ. 59 లక్షలు
హైదరాబాద్/ఎల్బీ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సీఎం కప్‌లో స్టేట్ లెవెల్ విన్నర్లకు ఇంకా ప్రైజ్‌మనీ దక్కలేదు. పోటీలు ముగిసి 16 రోజులు గడిచినా ఏ ఒక్కరికీ నగదు బహుమతి లభించలేదు. తొలుత మండల, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించిన శాట్స్ అక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులతో హైదరాబాద్‌లో గత నెల 28 నుంచి 31 వరకు 18 క్రీడాంశాల్లో స్టేట్ లెవెల్ గేమ్స్ ఆడించింది. టీమ్ విభాగంలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ నెగ్గిన జట్లకు వరుసగా రూ. లక్ష, 75 వేలు, 50 వేల నగదు, వ్యక్తిగత విభాగంలో ప్లేయర్లకు వరుసగా రూ.20 వేలు, 15వేలు, 10 వేల ప్రైజ్‌మనీ ఇస్తామని ప్రకటించింది. టీమ్, వ్యక్తిగత విభాగంలో కలిపి 700 మంది పైచిలుకు క్రీడాకారులు పతకాలు సాధించగా సర్టిఫికెట్స్ మాత్రమే అందించిన అధికారులు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. దాంతో, నడి ఎండలో ఎంతోకష్టపడి ఆడి గెలిచిన క్రీడాకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నగదు బహుమతి వస్తుందో లేదో తెలియడం లేదని వాపోతున్నారు. సీఎం కప్ పోటీల నిర్వహణలో పాలు పంచుకున్న అంపైర్లు, రిఫరీలు, ఇతర సపోర్ట్ స్టాఫ్‌కు రోజుకు వెయ్యి రూపాయాలు చెల్లిస్తామని అధికారులు చెప్పినా పైసా ఇవ్వలేదని చెబుతున్నారు.
ఇంకా ఐదారు రోజుల టైమ్ పడుతుంది: శాట్స్ అధికారులు
ఈ విషయంపై శాట్స్ అకౌంట్స్ అధికారులను సంప్రదించగా..గెలిచిన ప్లేయర్లకు ఆన్‌లైన్‌లో నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలని నిర్ణయించడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. ఇంకో ఐదారు రోజుల్లో నగదు వారి ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. ‘పతకాలు గెలిచిన మొత్తం 713 మంది బ్యాంక్ అకౌంట్ నంబర్స్ తీసుకున్నాం. కొందరి వివరాలు తప్పుగా ఉండటంతో మరోసారి సేకరించాం. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే గందరగోళం ఏర్పడుతుంది. అందరికీ ఒకేసారి అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేస్తాం. మొత్తం రూ. 59 లక్షల ప్రైజ్‌మనీ రెడీగా ఉంది’ అని వెల్లడించారు. అయితే, అంపైర్లు, రిఫరీలు, గేమ్స్ నిర్వహణలో పాల్గొన్న ఇతరులకు రోజువారీ భత్యం విషయం తమకు సంబంధం లేదని తెలిపారు.