V6 News

కుతుబ్ షాహీ టూంబ్స్​ వద్ద.. 13 దేశాల ప్రతినిధులకు సీఎం ఆతిథ్యం

కుతుబ్ షాహీ టూంబ్స్​ వద్ద.. 13 దేశాల ప్రతినిధులకు సీఎం ఆతిథ్యం

హైదరాబాద్, వెలుగు: కుతుబ్ షాహీ టూంబ్స్​ వద్ద 13 దేశాల ప్రతినిధులకు బుధవారం రాత్రి  సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు.  అమెరికా, ఇరాన్, టర్కీ, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్​లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం  పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సీఎస్​ శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.