అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని : జగన్ ఎన్నికల శంఖారావం

అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని : జగన్ ఎన్నికల శంఖారావం

కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం భీమిలీలో కనిపిస్తుందని.. ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉందన్నారు సీఎం జగన్. తాను పద్మవ్యూహంలో చిక్కుకునే అభిమన్యుడిని కాదని.. అర్జునుడినన్నారు.  తనకు ఇంతమంది కృష్ణుడి రూపంలో అండగా ఉన్నారని చెప్పారు. మనందరి టార్గెట్ 175 కి 175 సీట్లు రావాలని కోరారు. భీమిలిలోని సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు.

సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి దూకుపోతుంది వైసీపీ. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు జగన్‌.. ప్రచారంలో భాగంగా వైసీపీ భారీ ఎత్తున సిద్ధం హోర్డింగులను జిల్లాల్లో ఏర్పాటు చేసింది. సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి YCP కార్యకర్తలు వచ్చారు.  

మరో పాతికేళ్లు మన సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగాలని.. 56 నెలల్లో చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి చూపించామని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో 99శాతం నెరవేర్చామని చెప్పారు. మోసాన్ని, అబద్దాన్ని తాను నమ్ముకోలేదని.. చేసిన మంచినే నమ్ముకున్నానని వివరించారు. మరో 70 రోజుల్లోనే అబద్దానికి, నిజానికి మధ్య యుద్దం జరుగబోతుందన్నారు.   

650 హామీల్లో చంద్రబాబు 10 శాతం కూడా అమలు చేయ్యలేదన్నారు. మన ప్రభుత్వం 99శాతం హామీలు అమలు చేసి అందరిలో చిరునవ్వు తెచ్చామని చెప్పారు. లంచం, వివక్ష లేకుండా పథకాలను గడపదగ్గరకే తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో బడులను ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విలేజ్ క్లీనింగ్ లు, ఆరోగ్య సురక్ష.. ఇవన్నీ మన ఘనత అని గుర్తు చేశారు. మన పాలన, సంక్షేమ ఫలితంగా చంద్రబాబు కూడా ఓడాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. 

చంద్రబాబు 75 ఏళ్ల వయరసు మళ్లిన నాయకుడని.. ఆయనకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక పొత్తులు పెట్టుకుంటున్నాడని సీఎం జగన్ అన్నారు. చెప్పుకునేందుకు ఒక్క మంచిపని చంద్రబాబు దగ్గర లేదని విమర్శించారు. అందుకే కొత్త వాగ్ధానాలతో గారడీ చెయ్యాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని.. ఈసారి 2019 లో వచ్చిన 23 సీట్లు కూడా బాబుకు రావని చెప్పారు. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఒక్క గ్రామానికి కూడా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు సీఎం జగన్.