విజన్ విశాఖ : మళ్లీ గెలిచి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తా - జగన్ కామెంట్స్..!

విజన్ విశాఖ : మళ్లీ గెలిచి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తా - జగన్ కామెంట్స్..!

వైజాగ్ లో జరుగుతున్న విజన్ విశాఖ కార్యక్రమంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే నివసిస్తానని, మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో విజన్ విశాఖ గురించి వివరిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తులో విశాఖ అభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని, మనం చేయాల్సిందల్లా తుది మెరుగులు దిద్దటమే అని అన్నారు.

తాను అమరావతికి వ్యతిరేకం కాదని, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని అన్నారు. అన్ని ప్రణతలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే కర్నూలును కూడా న్యాయరాజధానిగా నిర్ణయించామని అన్నారు. అమరావతితో పోలిస్తే, విశాఖలో రాజధానికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించామని అన్నారు. విశాఖ లాంటి నగరం ఉన్నప్పుడు లక్ష కోట్లు పెట్టి అమరావతి లాంటి నూతన నగరాన్ని నిర్మించాల్సిన అవసతం లేదని అన్నారు.

ప్రతిపక్షాలకు తాను విశాఖలో ఉండటం ఇష్టం లేదని అందుకే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి, ఇక్కడే నివసిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దురదృష్ట వశాత్తు రాష్ట్ర పురోగతిని అడ్డుకుంటున్న ప్రతిపక్షం, వారి కుట్రలకు మద్దతు పలుకుతున్న ఎల్లో మీడియాతో పోరాడాల్సి వస్తోందని సీఎం జగన్ అన్నారు.