రుయా ఘటనపై విచారణకు ఆదేశం

రుయా ఘటనపై విచారణకు ఆదేశం

తిరుపతి రుయా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక సోమవారం 11 మంది చనిపోయిన ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదక ఇవ్వాలని అధికారులను కోరారు. ఆక్సిజన్ ట్యాంకు ఖాళీ అవడం.. సమయానికి సరఫరా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ అందక చనిపోయిన వారిసంఖ్య 11 అని అధికారులు చెప్పినప్పటికీ.. ఎక్కువ మంది చనిపోయారని బాధిత కుటుంబసభ్యులు చెప్పడం గమనార్హం. అరగంట పాటు హాస్పిటల్‌లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని రోగుల బంధువులు చెప్పారు. దాంతో వెంటిలేటర్‌పై ఉన్నవాళ్లు వెంటనే చనిపోగా.. ఆక్సిజన్ బెడ్లపై ఉన్నవాళ్లు ఊపిరాడక గిలాగిలా కొట్టుకుని చనిపోయారని తెలిపారు. ప్రమాద సమయంలో వార్డులో ఉన్న కరోనా పేషెంట్లు ఊపిరాడక పరుగులు తీశారు. అదే టైంలో ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో ప్లాంటులోకి ఆక్సిజన్ నింపారు. వెంటనే ఆక్సిజన్ సరఫరా స్టార్ అయినా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ప్రమాదం జరిగిన రెండు గంటలకు కానీ అధికారులెవరూ రాలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రాత్రి 8 గంటలకు ప్రమాదం జరిగితే.. పదిన్నర గంటలకు కలెక్టర్ వచ్చారన్నారు. ఆస్పత్రిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్.. 11మంది చనిపోయినట్లు ప్రకటించారు. చెన్నై నుంచి ట్యాంకర్ ఆలస్యంగా రావడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. రుయాలో మొత్తం వెయ్యిమంది ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ఆయన చెప్పారు. నిన్న అస్వస్థకు గురైన వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోందని కలెక్టర్ చెప్పారు.