ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే జగన్​ పై దాడి: వైసీపీ నేతలు

ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే  జగన్​ పై దాడి: వైసీపీ నేతలు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్​ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.  సిద్ధం సభలకు..జగన్​ రోడ్​ షోకు జనాలు భారీగా తరలివస్తున్నారు.  దాదాపు ఆంధ్రప్రదేశ్​ అంతటా  మొదటి విడత ప్రచారం చివరి దశలో ఉంది.  ఈ రోజు ( ఏప్రిల్​ 13) ఆంధ్రప్రదేశ్​ నడిబొడ్డు విజయవాడలో జగన్​ సిద్దం సభ నిర్వహిస్తున్నారు.  ఈ సభకు వచ్చిన అభిమానులు జగన్​పై పూల వర్షం కురిపించారు.  అయితే ఈ సమయంలో ఓ ఆగంతకుడు జగన్​ పై రాయి విసిరిన ఘటన చోటు చేసుకుంది.  దీంతో జగన్​ ఎడమ కంటికి గాయమైంది.  జగన్​ యాత్ర చేస్తున్న బస్సులోనే  వైద్యులు చికిత్స అందించారు.  

జగన్​కు వచ్చే జనాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  అయితే దాడి జరిగిన రూట్​లో పలుమార్లు విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  ఆగంతకుడు పూలతో బలంగా రాయిని విసిరాడు.  దగ్గరలోని పాఠవాల భవనం పక్క నుంచి ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడని సమాచారం అందుతోంది.  విజయవాడ సింగ్​నగర్​ ప్రాంతంలో దాడి జరిగింది.  అయితే సీఎం జగన్​ దాడిని లెక్క చేయకుండా ప్రథమ చికిత్స అనంతరం యాత్రను కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ ఘటనలో సీఎం జగన్​ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా గాయాలయ్యాయి.జగన్​ కు వస్తున్న  ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.