తెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది:సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది:సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రగతిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా అభివృద్దికి అడ్డకట్ట వేస్తోందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతామని స్వయంగా ప్రధానే ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేంద్ర వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు ప్రభుత్వాన్ని పడగొడతారా అని ప్రశ్నించారు.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైళ్లో పెట్టినట్లు చెప్పారు. అనాడు ఎంతో మంది తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం తెచ్చింది ప్రభుత్వాలను కూలగొట్టేందుకేనా అని ప్రశ్నించారు. రైతులకు కరెంట్ సరఫరా చేయడం చేతకాదు.. పేదలను ఆదుకోవడం చేతకాదు.., ఉద్యోగాలివ్వడం చేతకాదు..మంచినీళ్లు సరఫరా చేయడం చేతకాదు కానీ బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను అమ్మడం మాత్రం తెలుసని కేసీఆర్ చురకలంటించారు. 

గుజరాత్లోనూ లేవు..

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు..మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ అమలు కావడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలు లేవన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రభుత్వాలు లేవా..మంత్రులు లేరా..మరి అక్కడ ఇలాంటి పథకాలు ఎందుకు లేవన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో  రైతులకు ఉచితంగా కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇవన్నీ  ఓట్లు, చిల్లర రాజకీయాల కోసం ఇవ్వడం లేదని... రైతుల అభివృద్ధి కోసమే ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. నష్టం వాటిల్లినా..వేల కోట్లు పెట్టి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. తెలంగాణపై సవతి ప్రేమ ఒలకబోసే బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతాయని.. కానీ ఒక్క రూపాయి మాత్రం మంజూరు చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. 

తిరుగుబాటు తెలంగాణ నుంచే మొదలైతది

చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం దేశంలో ఉన్మాదాన్ని.. ప్రజల మధ్య ఉద్వేగాన్ని రెచ్చగొడుతున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు.  ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడి నుంచో తిరుగుబాటు మొదలు కావాలన్నారు. అది తెలంగాణ నుంచే మొదలవనుందని చెప్పారు. త్వరలో దేశ రాజకీయాల్లోకి వెళ్తామని..అందుకోసం పర్మీషన్ కావాలన్నారు. తెలంగాణ పునాదుల మీదుగా జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామన్నారు. బీఆర్ఎస్తో తెలంగాణ లాగే దేశాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు.

పాలమూరు డెవలప్ అవ్వాలి..

ఒకప్పుడు వలస జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో పయనిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని..కొన్ని అడ్డంకుల వల్ల పనులు ఆగిపోయాయన్నారు. త్వరలో కాల్వల నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు. అటు వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని కేంద్రానికి తీర్మానం పంపినా బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉండగానే తెలంగాణ సాధించామని గుర్తు చేశారు. ఈ  జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఏసీడీసీ నిధుల ద్వారా ఇప్పటికే జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి రూ. 5 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం అదనంగా మరో రూ. 15 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో దళిత బంధు అమలు చేసుకోవాలన్నారు. త్వరలో సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ. 3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఇతర జిల్లాల కంటే..మహబూబ్ నగర్ జిల్లాలో నియోజకవర్గానికి  అదనంగా వెయ్యి ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.