‘మక్కల సాగు వద్దు.. అయినప్పటికీ సాగు చేయాలనుకుంటే అది మీ రిస్క్’

‘మక్కల సాగు వద్దు..  అయినప్పటికీ సాగు చేయాలనుకుంటే అది మీ రిస్క్’

2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు సూచించాలని కోరారు. ప్రస్తుత వానాకాలం సీజన్ లో ప్రభుత్వం సూచించిన మేరకు వందకు వంద శాతం నిర్ణీత పద్ధతిలోనే రైతులు పంటలు సాగు చేశారని, ఇదే ఒరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని సిఎం పిలుపునిచ్చారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో.. వరి పంటను 50 లక్షల ఎకరాల్లో, శనగ 4.5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 4 లక్షల ఎకరాల్లో, మిరపతో పాటు ఇతర కూరగాయలు లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో, జొన్న లక్ష ఎకరాల్లో నువ్వులు లక్ష ఎకరాల్లో, పెసర్లు 50 నుంచి 60 వేల ఎకరాల్లో, మినుములు 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 30-40 వేల ఎకరాల్లో, ఆవాలు-కుసుమలు-సజ్జలు లాంటి పంటలు మరో 60 నుంచి 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సిఎం వెల్లడించారు. వ్యవసాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, తద్వారా మంచి ధర పొందాలని సిఎం పిలుపునిచ్చారు.

‘‘ఏ కొత్త విధానమయినా, ఎవరికయినా ఒక్క రోజుతో, ఒక్క ప్రయత్నంతో అలవాటుకాదు. నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే నూతన విధానానికి అలవడుతుంది. రైతులకు కూడా, వారికి లాభం జరుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు అర్థం చేయిస్తే అవగాహన, చైతన్యం పెరుగుతాయి’’ అని సిఎం చెప్పారు.

‘మక్కల సాగు శ్రేయస్కరం కాదు’

మక్కల ధర, మార్కెట్ విషయంలో అనిశ్చితి నెలకొన్నందున మక్కల సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా కూడా మక్కల సాగు వద్దనే రైతులకు సూచన చేయడం ఉత్తమమని అధికారులు చెప్పారు. మక్కలకు 900 రూపాయలకు మించి ధర వచ్చే అవకాశం లేదని వారు అంచనా వేశారు. మక్కలు వేస్తే మంచి ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, మక్కల సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని సిఎం కోరారు. మక్కల సాగు వద్దు అనేదే ప్రభుత్వ సూచన అనీ, అయినప్పటికీ ఎవరైనా రైతులు మక్కలు సాగు చేయాలని భావిస్తే అది వారి రిస్క్ అని సిఎం స్పష్టం చేశారు. ఎంత ధరవస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులే మక్కలు పండించుకోవాలన్నారు.