
- నల్గొండ టౌన్ అధికారుల తీరుపై సీఎం ఫైర్
- టౌన్ నుంచి ఏ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు పోతుందన్న సీఎం
- ఒక్కోరకంగా సమాధానం చెప్పడంతో మండిపాటు
నల్గొండ, వెలుగు : నల్గొండ టౌన్ అధికారులపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తాను అడిగిన ప్రశ్నలకు, లెక్కలకు ఒక్కో అధికారి ఒక్కోరకంగా సమాధానం ఇవ్వడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నల్గొండ టౌన్ నుంచి ఆర్ అండ్ బీ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు పోతాయని ప్రశ్నించగా.. ఆర్ అండ్ బీ అధికారుల్లో ఒకరు ఆరు కిలోమీటర్లు అని, మరొకరు 17 కిలోమీటర్లు అని బదులిచ్చినట్లు తెలిసింది. దీంతో సీఎం సీరియస్ అయి.. ‘‘ఇదేం జిల్లా.. మీరేం ఆఫీసర్లు” అంటూ మండిపడ్డట్లు సమాచారం. మున్సిపల్ రోడ్లు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయని ప్రశ్నించగా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బదులివ్వకపోవడంతో ఆ అధికారిని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. నల్గొండ మున్సిపాలిటీతోపాటు, కొత్త మున్సి పాలిటీల్లో నెలకొన్న సమమస్యలపై బుధవారం నల్గొండ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. 2018 ఎన్నిక ల ప్రచారంలో భాగంగా నల్గొండను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు.
ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు, ప్రస్తుతం నల్గొండలో నెలకొన్న ప్రధాన సమస్యలపైనా సీఎం కేసీఆర్ చర్చించారు. నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు, 150 కోట్లు ఖర్చయినా మంజూరు చేస్తానన్నారు. కరెంట్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు వెంటనే కావాల్సినన్ని సబ్ స్టేషన్లు నిర్మించాలని ఆదేశించారు. అనువైన స్థలాలను ఎంపిక చేసి వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మా ణం చేపట్టాలని, రైతు బజార్లు నిర్మించాలని అన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నల్గొండ మున్సిపల్ కమిషనర్ పోస్టులోకి సిద్దిపేట జిల్లా మున్సిపల్ కమిషనర్ రమణాచారిని ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్ అండ్ బీ రోడ్లు, మున్సిపల్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు ఎన్ని ఉన్నాయనే ప్రశ్నలకు ఒక్క అధికారి నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డ్రైనేజీ కాలువల పొడవెంత అంటే దానికి కూడా సమాధానం రాకపోవడంతో మండిపడ్డట్లు సమాచారం. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, టౌన్ ఏం బాగోలేదని, వెంటనే మార్పు రావాలని ఆదేశించారు. రూ. 36 కోట్లతో ఎన్జీ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఉదయసముద్రం వద్ద ఉన్న ట్యాంక్ బండ్ ను సుందరీకరించాలని, అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలని, రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన టౌన్ హాల్ నిర్మించాలని ఆదేశించారు. ఉప్పల్ భగాయత్ మాదిరిగా ల్యాండ్ పూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలన్నారు. ఈ నెల 31న మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి నల్గొండకు వస్తారని, ఆ పర్యటనలో భాగంగా నల్గొండతోపాటు, కొ త్త మున్సిపాలిటీల్లో సమస్యల పై రివ్యూ చేస్తారని సీఎం చెప్పారు. అప్పటికప్పుడు మంత్రి కేటీఆర్‌కు ఆయన ఫోన్ చేసి విషయం చెప్పారు. మంత్రుల పర్యటనలో భాగంగా నల్గొండలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
నువ్వు ఊకో భూపాల్..!
నల్గొండ మున్సిపాలిటీ గురించి చర్చ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడేందుకు పలు మార్లు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో కొంత అసహనానికి గురైన సీఎం.. ‘‘నువ్వు ఊకో భూపాల్...నువ్వు ఊకో’’ అంటూ మందలించినట్లు సమాచారం. నల్గొండ టౌన్లో ప్రభుత్వ ల్యాండ్ ఎంత ఉందని చర్చకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే కలుగజేసుకోబోగా.. ‘‘అధికారులతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు ఎంటరవుతున్నవ్. నువ్వు ఊకో భూపాల్’’ అని సీఎం అన్నట్లు తెలిసింది.
ఎమెల్యే తండ్రి మారయ్యకు సీఎం నివాళి
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య దశదిన కర్మకు సీఎం హాజరయ్యారు. నల్గొండ కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న కిషోర్ ఇంటికి ఆయన వెళ్లి.. మారయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ప్రాజెక్టు కాలనీల వాసులకు ఇళ్ల పట్టాలు
ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయిన వారికి ఇంటి క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలనీవాసులతోపాటు నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని, వారందరికీ శాశ్వత పట్టాలు కల్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆయన ఫోన్లో సూచించారు. కాగా, సీఎం కేసీఆర్ కలెక్టరేట్ నుంచి బస్సులో టౌన్ హాల్ వరకు వస్తూ రోడ్లను పరిశీలించారు. నీటిపారుదల శాఖ కార్యాలయాలను ఒకే చోటకు తరలించి టౌన్‌హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.