
నల్గొండ జిల్లా: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమకారుడిగా కొనసాగడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నందునే ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం, సర్వే రిపోర్టుల ఆధారంగా కూసుకుంట్లకు అవకాశమిచ్చారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు జన్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని లింగవారి గూడెం ఆయన స్వస్థలం. నల్గొండలోని నాగార్జన కాలేజ్ నుంచి బీఎస్సీ కంప్లీట్ చేసిన కూసుకుంట్ల.. హైదరాబాద్ లోని వివేక్ వర్ధిని కాలేజ్ నుంచి బి.ఎడ్ పట్టా అందుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం టీచర్ గా పనిచేశారు.
విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. 2002లో కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వరాష్ట్ర ఉద్యమంలోకి వచ్చారు. 2003 నుంచి టీఆర్ఎస్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న కూసుకుంట్ల రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో పార్టీ ఇంఛార్జిగా వ్యవహరించి టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేశారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మహేశ్వరం నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన.. 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014 అసెంబ్లీ ఎలక్షన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా 38,055 ఓట్ల మెజార్టీతో మనుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగినా 22,552 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.