ఎర్రవల్లిలో సీఎం కొత్త ఇల్లు

ఎర్రవల్లిలో సీఎం కొత్త ఇల్లు
  • వాస్తు దోషమే కారణమని చర్చ
  • అధునాతన హంగులతో కొత్త డిజైన్​
  • శరవేగంగా భవన నిర్మాణ పనులు
  • కార్తీక మాసంలో గృహ ప్రవేశం
  • వాస్తు దోషమే కారణమని చర్చ
  • అధునాతన హంగులతో కొత్త డిజైన్​
  • శరవేగంగా భవన నిర్మాణ పనులు
  • కార్తీక మాసంలో గృహ ప్రవేశం

హైదరాబాద్, వెలుగుసీఎం కేసీఆర్​ తన ఎర్రవల్లి ఫామ్​హౌజ్​లో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న నిర్మాణాలను రెండు నెలల కిందే కూల్చివేశారు. అదే పరిసరాల్లో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. జూన్​ చివరివారంలోనే భూమి పూజ చేశారని, ప్రస్తుతం పునాదులు తీసి, ఫిల్లర్లు వేసే పనులు చకచకా జరుగుతున్నాయి. దీంతో రెండు నెలల కిందటి వరకు భారీ భద్రత, సీఎం రాకపోకలతో కళకళలాడిన ఎర్రవల్లి ఫామ్​హౌజ్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. గతంలో ఉన్న బిల్డింగ్​ వాస్తుకు అనుగుణంగా లేదని, అందుకే పాతది కూలగొట్టి.. సీఎం కొత్త భవంతి కట్టుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

వేగంగా భవన నిర్మాణం

హైదరాబాద్​కు 65 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో సీఎం ఫామ్​హౌజ్​ ఉంది. తొమ్మిదేళ్ల కింద ఎర్రవల్లిలో సాగుభూమి కొనుగోలు చేసిన కేసీఆర్.. అక్కడే ఫామ్​హౌజ్​ నిర్మించుకున్నారు. అప్పుడు వాస్తుకు అనుగుణంగా ఫామ్​హౌజ్​లో నైరుతి వైపున బిల్డింగ్​ కట్టించారు. గ్రౌండ్​ ఫ్లోర్​ను ఖాళీగా ఉంచి పై రెండంతస్తులను గెస్ట్ హౌజ్​గా ఉపయోగించారు. సీఎం సెక్యూరిటీ పోస్టును, పంట ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు గోడౌన్లను నిర్మించారు. ఖాళీ టైమ్​ దొరికినప్పుడల్లా కేసీఆర్​ ఈ ఫామ్​హౌజ్​కు వెళ్లి వ్యవసాయ పనులు, పొలాలను దగ్గరుండి చూసుకునేవారు. ప్రతి నెలలో వారం పది రోజులు అక్కడే గడిపే వారు. పార్టీ ముఖ్య నేతలు అక్కడికి వెళ్లే సీఎంను కలుసుకునే వారు. 2015 డిసెంబర్​లో ఈ ఫామ్ హౌజ్​ పరిసరాల్లో అత్యంత వైభవంగా ఐదు రోజుల పాటు అయుత మహా చండీ యాగం కూడా చేయించారు. ఆ యాగం చివరిరోజున ప్రమాదవశాత్తు యాగశాలకు నిప్పంటుకుంది. వాస్తు దోషమే దానికి కారణమని వాస్తు నిపుణులు, పండితులు సీఎంకు చెప్పినట్టు చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్​ ఫామ్​హౌజ్​కు అనుకొని ఉన్న కొంత భూమిని కొనుగోలు చేసి, కలుపుకోవడంతో నైరుతి పెరిగిందని, దాంతో వాస్తు దెబ్బతిందని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో పండితుల సలహాలు, సూచనల మేరకు నైరుతి మూలలో కొత్త భవనం నిర్మాణం చేపట్టారని, అధునాతన హంగులతో డిజైన్​ రూపొందించారు. ప్రగతిభవన్​లోని ఇంటి తరహాలోనే అన్ని సదుపాయాలు ఉండేలా నిర్మిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి కావాలని, కార్తీక మాసంలో గృహప్రవేశం చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. అందుకే శరవేగంగా పనులు జరుగుతున్నాయి.