కాంగ్రెస్ పార్టీ మీ వేలితోనే మీ కన్ను పొడవాలని చూస్తున్నది : కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ మీ వేలితోనే మీ కన్ను పొడవాలని చూస్తున్నది : కేసీఆర్

నిజామాబాద్, వెలుగు:  రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణిని తీసేస్తే మళ్లీ పాత వీఆర్ఓ, గిర్దావర్, పైరవీ కార్ రాజ్యం వస్తాయని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మీ వేలితోనే మీ కన్ను పొడవాలని చూస్తున్నది. ధరణి బంద్, కరెంట్ కట్, రైతు బంధు క్లోజ్​అంటున్న దుర్మార్గపు కాంగ్రెస్‌ను ఎలక్షన్​లో మట్టికరిపించాలి. ఎలక్షన్లు అంటే సినిమా మ్యాట్నీ షో కాదు. ప్రజల చేతిలో ఉండే బలమైన ఆయుధం ఓటు. ఆలోచించకుండా వేస్తే ఆ ఓటే మనల్ని కాటేస్తది” అని చెప్పారు. బుధవారం మెదక్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఎల్లారెడ్డిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘ధరణి వల్లనే రైతులకు నేరుగా రైతుబంధు అందుతున్నది. వడ్ల పైసలు రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నం. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే వారంలో రూ.5 లక్షల రైతు బీమా వారి ఇంటికి చేరుతుంది. రైతులు గంపగుత్తగా బీఆర్ఎస్‌కు ఓట్లు వేయడానికి ధరణి ఒక్కటి చాలు’’ అని కేసీఆర్ అన్నారు. 

బతికి ఉన్నన్నాళ్లూ సెక్యులర్‌‌గానే

‘‘మంచిగున్నోళ్లను తీసుకెళ్లి సమైక్య రాష్ట్రంలో కలిపారు. విడిపించడానికి 58 ఏండ్లు కొట్లాడినం. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకొని రాష్ట్రం, కేంద్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ గవర్నమెంటు ఏర్పాటు చేసి కూడా తెలంగాణ ఇవ్వకుండా ఏడ్పించారు. వందల మంది చనిపోతే గానీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే. మరిన్ని ప్రాణాలు పోకుండా అల్లా దయ వల్ల తెలంగాణ వచ్చింది. 24 ఏండ్లు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చిన. ఎన్నికైన మా వాళ్లను కొనే ప్రయత్నం చేసి పార్టీలో చీలిక తేవడానికి ప్రయత్నించారు. పదేండ్లలో మంచి జరుగుతుంటే వారికి కండ్లు మండుతున్నయ్’​’ అంటూ కేసీఆర్ ఫైరయ్యారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగొద్దంటే బీఆర్ఎస్​ గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే మైనార్టీలను వాడుకుంటుందని, 2004 నుంచి 2014  దాకా కాంగ్రెస్​ గవర్నమెంట్​ మైనారిటీల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే  బీఆర్ఎస్​ప్రభుత్వం ఈ పదేండ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. తాను  బతికి ఉన్నంత వరకు సెక్యులర్ విధానంలోనే నడుస్తానని, అన్నదమ్ముల్లా కలిసి ముందుకు పోదామని పిలుపునిచ్చారు.

మొరాయించిన హెలికాప్టర్

ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ కొద్దిసేపు మొరాయించింది. బుధవారం సాయంత్రం మెదక్ సభ ముగిసిన తరువాత తిరిగి వెళ్లే క్రమంలో ఐదు నిమిషాల పాటు సరిగ్గా పని చేయలేదు. దీంతో అధికారులు ఆల్టర్నేట్​గా రోడ్డు మార్గంలో వెళ్లేందుకు వీలుగా బస్​ను రెడీ చేశారు. అయితే హెలికాప్టర్ స్టార్ట్ కావడంతో సీఎం అందులోనే వెళ్లిపోయారు.

మూడు గంటల్లో మడి తడుస్తదా? 

‘‘రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు వేస్ట్‌ అని, కేసీఆర్‌ డబ్బులన్నీ దండగ చేస్తున్నడని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు. మూడు గంటల కరెంటు సరిపోతుందట? మూడు గంటల్లో మడి తడుస్తుందా?” అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ప్రధాని మోదీ వార్నింగ్​ఇచ్చిండు.. మీటర్లు పెట్టకుంటే  ఐదేండ్లలో తెలంగాణకు ఇవాల్సిన రూ.25 వేల కోట్లను ఎగ్గొట్టిండు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యలే. రాష్ట్రాన్ని 33 జిల్లాలకు పెంచగా కొత్త జిల్లాలకు ఒక్క నవోదయ ఇవ్వలే. అలాంటి బీజేపీకి ఓటెందుకు వేయాలి?” అని ప్రశ్నించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఏదో ఒక్క పార్టీనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, ప్రాంతీయ పార్టీల హవా ఉండబోతున్నదని కేసీఆర్​ అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్​ గెలిస్తే ఢిల్లీలో తడాఖా చూపెట్టవచ్చని, ఇప్పటి నుంచే ప్రజలు ఆ ఎన్నికలకూ ప్రిపేర్ కావాలని పిలుపునిచ్చారు.