దేశం వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం: సీఎం కేసీఆర్

దేశం వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం: సీఎం కేసీఆర్
  • మంథనిలో నదుల మీద బ్రిడ్జిలు లేకుండె
  • మారుమూల పల్లెలకూ రోడ్లు వేయించినం
  • ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

మంథని: దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ విధానాలే కారణమని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంథనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ‘దేశంలో రైతుల గురించి గానీ, దళిత బిడ్డల గురించి గానీ, గిరిజన ఆదివాసీల గురించి గానీ కాంగ్రెస్‌ పార్టీ సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే ఇవాళ దేశం ఇట్ల ఎందుకుంటుండె..? ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుండె..? ఇది మీరొకసారి ఆలోచించాలె. మన కంటే వెనుకకు స్వాతంత్య్రం వచ్చిన చైనా కూడా ఎంతో ముందుకు దూసుకుపోయి అమెరికాతో పోటీ పడుతున్నది. మరె మనకు ఈ గతి ఎందుకు..? ఇవి ఆలోచించకుండా గుడ్డిగ ఓటేస్తే మంచి ఫలితం రాదు. దెబ్బతింటం. అందుకే ఆలోచించకుండా, బాధ్యత లేకుండా ఓటు వేయొద్దని నేను కోరుతున్నా’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


 ‘మంథనిలో పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగ్‌ రోడ్డును ఎవరూ పూర్తి చేయలే. పుట్ట మధు వచ్చినంకనే నా వెంటపడి దాన్ని పూర్తి చేసిండు. అనేక గ్రామాలకు రోడ్లు లేకుండె. నదుల మీద బ్రిడ్జిలు లేకుండె. నా వెంటపడి కొన్ని వందల కిలోమీటర్లకు రోడ్లు వేయించిండు. పలిమెల, పంకెన లాంటి మారూమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించిన ఘనత పుట్ట మధుది. ఆయన ఎంత చేయాల్నో అంత చేసిండు. కానీ మీరే ఆయన పని చేసిండ్రు. నిజమా.. కాదా..?’ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించడంపై సీఎం ప్రశ్నించారు.