ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారనేది సీక్రెట్

ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారనేది సీక్రెట్
  • జాతీయ పార్టీ కార్యాచరణపై చర్చిస్తున్నారంటున్న టీఆర్​ఎస్​ లీడర్లు
  • లిక్కర్​ స్కామ్​పై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారంటున్న ప్రతిపక్షాలు
  • సీఎస్, డీజీపీకి సీఎం ఢిల్లీ పిలుపు.. రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిన ఆసక్తి 

హైదరాబాద్ / న్యూఢిల్లీ​, వెలుగు : సీఎం కేసీఆర్​ ఢిల్లీ టూర్​  చర్చనీయాంశమైంది. వారం రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఎందుకు ఉంటున్నారు..?  అక్కడేం చేస్తున్నారు..? అనేదానిపై అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాల్లోనూ రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి. మునుగోడు బై పోల్​ను టీఆర్​ఎస్​ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఏ ఎలక్షన్​కు లేని విధంగా రాష్ట్ర కేబినెట్​ను, ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి తరలించారు. స్వయంగా ఆయన ఒక గ్రామానికి ఇన్​చార్జ్​గా ఎలక్షన్​ బాధ్యతలు తీసుకున్నారు. ఇదే టైమ్​లో ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో రాష్ట్రానికి చెందిన లీడర్ల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ, సీబీఐ ప్రత్యేక బృందాలు హైదరాబాద్​లో పలు చోట్ల సోదాలు నిర్వహించాయి. ఇప్పటికే పలువురిని విచారించాయి. కొందరు లీడర్లకు స్కామ్​తో సంబంధాలున్నాయనే వార్తలు టీఆర్​ఎస్​లో కలకలం రేపాయి. ఈ టైమ్​లో కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లడం.. వారం రోజులుగా అక్కడే ఉండటం ఆసక్తిరేపుతున్నది. 

2 రోజులు పార్టీ ఆఫీసు పనులు పరిశీలించి!

టీఆర్​ఎస్​ పార్టీ పేరును బీఆర్​ఎస్​గా మారుస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తొలిసారి కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీఆర్​ఎస్​ పార్టీ కోసం రెంట్​కు తీసుకున్న ఆఫీస్ రిపేర్లు, పార్టీ సొంత భవన నిర్మాణ పనులను మొదటి రెండు రోజులు ఆయన పరిశీలించారు. హైదరాబాద్​ నుంచి వాస్తు నిపుణులను అక్కడికి పిలిపించుకొని సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఐదురోజులుగా కేసీఆర్​ ఎవరినీ కలువకపోవటం గమనార్హం. బీఆర్​ఎస్ భవిష్యత్​ కార్యాచరణపైనే వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లిక్కర్​ స్కామ్​ నేపథ్యంలో పలువురు న్యాయ నిపుణులతో ఢిల్లీలో కేసీఆర్​ సంప్రదింపులు జరుపుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఎప్పుడు వచ్చినా మూడురోజులు ఉంటుండె..!

సీఎం కేసీఆర్​ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా దాదాపు మూడు రోజుల్లో పనులు ముగించుకొని హైదరాబాద్​కు తిరుగు పయనమయ్యేవారు. కానీ, ఏడాది కాలంగా ఆయన షెడ్యూల్​లో పూర్తి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 5 సార్లు కేసీఆర్​ ఢిల్లీకి వెళ్లగా.. ప్రతిసారి దాదాపు వారంపాటు అక్కడే ఉన్నారు. ఈ నెల 11 నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. మరో మూడు రోజులు అక్కడే ఉంటారని సమాచారం.  లిక్కర్​ స్కామ్​ నేపథ్యంలో పలువురు న్యాయ నిపుణులతో ఢిల్లీలో కేసీఆర్​ సంప్రదింపులు జరుపుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేసీఆర్​ డైలీ షెడ్యూల్​ను సీఎంవో రిలీజ్​ చేయటం లేదని, అంతా గోప్యత పాటిస్తున్నారని ఢిల్లీలోని మీడియా వర్గాలు చెప్తున్నాయి. రాజకీయపరమైన అంశాలు, కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకునే పనిలో తరచూ కేసీఆర్​ ఢిల్లీకి వెళుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నెల 11న ములాయంసింగ్​ అంత్యక్రియలకు హాజరైన కేసీఆర్​.. అదేరోజు అటు నుంచే ఢిల్లీకి వెళ్లారు. కూతురు కవిత, ఎంపీ సంతోష్​ కేసీఆర్​వెంటనే ఉంటున్నారు. 

మునుగోడు బైపోల్​ మానిటరింగ్​

వారం రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న సీఎం కేసీఆర్​.. అక్కడి నుంచే మునుగోడు ఉప ఎన్నికను మానిటర్​ చేస్తున్నారు. నేతల ప్రచార తీరుతెన్నులు, పార్టీలో చేరికలు వలసలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. మంత్రులను, ఎమ్మెల్యేలను పదిరోజుల కిందట్నే మునుగోడు నియోజకవర్గంలో దింపిన కేసీఆర్​.. ప్రతి ఓటరును కలవాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలిచి తీరాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్​, పార్టీ స్పెషల్​ స్వ్వాడ్​  నుంచి వస్తున్న రిపోర్టుల ఆధారంగా లీడర్లను  ఆయన అలర్ట్​ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

ఢిల్లీకి సీఎస్​, డీజీపీ

సీఎం కేసీఆర్​ ఢిల్లీలోనే ఉండటంతో.. సోమవారం సీఎస్​ సోమేశ్​ కుమార్​, స్పెషల్​ సీఎస్​ అర్వింద్​ కుమార్​, డీజీపీ మహేందర్​రెడ్డి హుటాహుటిన అక్కడికి వెళ్లారు. సీఎం పిలుపుతోనే వీరిద్దరూ బేగంపేట నుంచి స్పెషల్​ ఫ్లైట్​లో ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. ఆదివారం రాత్రి ఇరిగేషన్​ స్పెషల్​ సీఎస్​ రజత్​ కమార్​ కూడా ఢిల్లీకి వెళ్లారు. అమృత్​, పీఎం అవాస్​ యోజన కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 3,500 కోట్లు రావాల్సి ఉన్నదని, ఈ నిధులపై చర్చించేందుకు సీఎస్​, స్పెషల్​ సీఎస్​ ఢిల్లీ వెళ్లినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. సీఎంతో పాటు మంత్రులెవరూ లేకపోవటంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు స్తంభించి పోయాయి.