ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నీతులు చెబుతున్నారు: కోదండరెడ్డి

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నీతులు చెబుతున్నారు: కోదండరెడ్డి

హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు చెప్పాల్సిన  బాధ్యత టీఆర్ఎస్,  బీజేపీలదేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి..ఇప్పుడేమో నీతులు చెబుతున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు. కనీసం గవర్నర్ ను పిలవకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

స్పీకర్ ఏనాడూ తన బాధ్యతలను నిర్వర్తించకపోగా.. సీఎం కేసీఆర్ ఏవిధంగా చెబితే ఆవిధంగా నడిచే వ్యవస్థకు దారివేశారని కోదండరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ లోపల.. బయట సాధారణ సమయాల్లో కూడా స్పీకర్ తీరు అదేవిధంగా ఉందన్నారు. అసెంబ్లీలో సీఎం ఏమైనా హామీలిస్తే వాటి అమలు బాధ్యతను చూసేందుకు అష్యూరెన్స్ కమిటీ ఉంటుందని గుర్తు చేశారు. అయితే ఆ కమిటీ ఇంత వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదన్నారు.

సీఎం కేసీఆర్ అనేకసార్లు ఎన్నో వాగ్దానాలు చేసినా వాటి గురించి పట్టించుకునే వారే లేకుండాపోయారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు చేసిన వారిని చట్ట విరుద్ధంగా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని.. అలాంటి వారితో స్పీకర్  ప్రమాణ స్వీకారం చేయించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించుకుని వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలనే కాదు.. అన్ని వ్యవస్థలను.. భ్రష్టు పట్టించారని కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.