ఇక వేగంగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం!.

ఇక వేగంగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం!.
  •  మధిరలో జెట్​స్పీడ్, ఖమ్మం, పాలేరులో కొంత స్లో
  •  వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో గత నెల టెండర్లు పూర్తి
  •  వచ్చే విద్యాసంవత్సరానికల్లా పూర్తి చేయాలని భట్టి ఆదేశం

ఖమ్మం, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం ఇక స్పీడందుకోనున్నాయి. ఒక్కొక్కటి రూ.200 కోట్లతో ఐదు నియోజకవర్గాల్లో పనులు చేపట్టగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరలో జెట్ స్పీడ్ తో పనులు జరుగుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో కొంత ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి. బోనకల్​ మండలం లక్ష్మీపురంలో గతేడాది అక్టోబర్​ 11న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పనులకు శంకుస్థాపన చేశారు. 

అదే రోజు పాలేరు నియోజకవర్గానికి గాను ఖమ్మం రూరల్​ మండలం పొన్నేకల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నియోజకవర్గానికి చెందిన స్కూల్​ కు రఘునాథపాలెం మండలం జింకలతండా దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. మధిర స్కూల్​ పనులు నాలుగు విభాగాలుగా చేపట్టగా గ్రౌండ్ ఫ్లోర్​ నిర్మాణం జరిగింది. ఇప్పటికే ఇక్కడ రూ.16 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్​ కు చెల్లించారు.

 ఖమ్మంలో గ్రౌండ్ ఫ్లోర్ కోసం ​పుట్టింగ్స్ పూర్తి కాగా, పాలేరు మాత్రం మూడు నెలల కింద టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల స్థలాన్ని చదును చేయగా, మెటీరియల్ ను డంపింగ్ చేస్తున్నారు. మిగిలిన సత్తుపల్లి, వైరాలో నెల రోజుల కింద టెండర్లు పూర్తయ్యాయి. వెంటనే పనులు మొదలవుతాయని అధికారులు
 చెబుతున్నారు. 

20 నుంచి 25 ఎకరాల స్థలంలో.. 

జిల్లాలో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఐదు స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ముందుగా మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు స్కూళ్లు మంజూరు కాగా, ఆ తర్వాత రెండో విడతలో వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కేటాయించారు. ఒక్కొక్కటి 18 నెలల కాలపరిమితితో పనులను పూర్తి చేయాలని అగ్రిమెంట్లలో కండిషన్​ పెట్టారు. ఈ స్కూళ్లకు బిల్లుల మంజూరులో ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జిల్లా కలెక్టర్ అకౌంట్లలో నిధులను జమ చేసింది. 

దీంతో పనులు జరుగుతున్న స్పీడ్ ప్రకారమే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నిధులు కూడా మంజూరవుతాయి. అయితే స్థల సేకరణ సమస్యలు, టెండర్ల ఆలస్యం లాంటి కారణాలతో పనుల ప్రారంభం కొంత ఆలస్యమైంది. తాజాగా ఈ స్కూళ్ల నిర్మాణ పనులపై ఆఫీసర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అన్ని చోట్లా పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి రోజూ వర్క్​ మానిటర్ చేయాలని సూచించారు. 

రాష్ట్రమంతటా ఒకటే డిజైన్..! 

ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్​ స్కూళ్లతో విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే డిజైన్​ లో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్ స్కూళ్లను కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్కూల్ లో 2,560 మంది వరకు విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఇలా అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుకోవచ్చు. 

ప్రతి స్కూల్​ లో 120 మంది చొప్పున టీచర్లు పనిచేస్తారు. ఈ స్కూళ్లకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్​ భవనాన్ని నిర్మిస్తారు. ఒక్కో లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, క్లాసు రూముల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. 900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్, స్టూడెంట్స్​ తో పాటు టీచర్లకు రెసిడెన్షియల్ క్యాంపస్​, ప్రతీ డార్మిటరీలో 10 బెడ్​ లు, రెండు బాత్ రూమ్​ లు ప్లాన్​ చేశారు.

 క్యాంపస్​ లో గ్రీనరీని డెవలప్​ చేయడంతో పాటు సోలార్​ ఎనర్జీ, వర్షపు నీటి సంరక్షణ, కల్చరల్ యాక్టివిటీస్​ కోసం ఆడిటోరియం, ఇండోర్, ఔట్ డోర్​ స్టేడియంతో పాటు ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని కూడా గురుకులాల ఆవరణలో ఏర్పాటు చేస్తారు. ,