- జిల్లాల్లో ఉత్సాహంగా సాగుతున్న కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నీ
- నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ముగిసిన టోర్నమెంట్
- పలు జిల్లాల్లో నేడు ఫైనల్ మ్యాచ్‌లు
వెలుగు నెట్‌వర్క్ : విశాక ఇండస్ట్రీస్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నీలో క్రీడాకారులు పరుగుల వరద పారిస్తున్నారు. వరంగల్ జిల్లా మొగిలిచర్ల, ములుగు జిల్లా జాకారం, జనగామ జిల్లా వంగాలపల్లి గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరిగాయి. వంగాలపల్లిలో వరంగల్, జనగామ జట్లు తలపడగా.. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ 174 స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జనగామను 17.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్ కావడంతో వరంగల్ టీమ్ ఘన విజయం సాధించింది.
జాకారంలో హనుమకొండ, ములుగు జిల్లాలు పోటీ పడగా... హనుమకొండ జట్టు 134 స్కోర్ చేయగా.. ములుగు టీమ్ 107 స్కోర్ చేసి ఓటమి పాలైంది. మొగిలిచర్లలో భూపాలపల్లి, మహబూబాబాద్ టీమ్స్ తలపడగా... భూపాలపల్లి జట్టు గెలుపొందింది. మధ్యాహ్నం మొగిలిచర్లలో హనుమకొండ, మహబూబాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా... హనుమకొండ, జాకారంలో వరంగల్, ములుగు జట్లు తలపడగా వరంగల్, వంగాలపల్లిలో జనగామ, భూపాలపల్లి టీమ్స్ పోటీ పడగా.. భూపాలపల్లి జట్టు విజయం సాధించాయి.
ఖమ్మం సిటీలోని వైఎస్సార్‌నగర్ సమీపంలోని గ్రౌండ్‌లో గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భద్రాద్రి టీమ్ 20 ఓవర్లలో 158 పరుగులు చేయగా... తర్వాత ఖమ్మం జట్టు 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది. దీంతో 34 రన్స్ తేడీతో భద్రాద్రి జిల్లా విజేతగా నిలిచింది.
ఫైనల్‌లో నల్గొండ విజయం
నల్గొండ జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది. ఫైనల్లో యాదాద్రి, నల్గొండ టీమ్స్ పోటీ పడగా.. మొదట బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. 193 టార్గెట్‌తో బరిలోకి దిగిన యాదాద్రి టీం 15 ఓవర్లలో 70 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 122 పరుగుల ఆధిక్యంతో నల్గొండ విజయం సాధించింది. విన్నర్స్‌కు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి కప్‌ను అందజేశారు.
కరీంనగర్ జిల్లా అలుగునూరులోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్‌తో జరుగుతున్న టోర్నీలో గురువారం కరీంనగర్, పెద్దపల్లి టీమ్స్ పోటీ పడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 143 పరుగులు చేయగా.. పెద్దపల్లి జట్టు 17.2 ఓవర్లలో 61 పరుగులకే ఆలౌట్ కావడంతో కరీంనగర్ టీం గెలిచింది. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో జగిత్యాల, సిరిసిల్ల జట్లు తలపడగా మొదట సిరిసిల్ల టీమ్ 137 చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జగిత్యాల 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని విజయం సాధించింది.
శుక్రవారం ఉదయం జరగనున్న ఫైనల్‌లో కరీంనగర్, సిరిసిల్ల జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు హాజరుకానున్నారు.
మంచిర్యాల జిల్లా గుడిపేటలో నిర్మల్, కుమ్రంభీం జట్ల మ్యాచ్
మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో జరుగుతున్న పోటీల్లో గురువారం ఉదయం నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన నిర్మల్ 177 పరుగులు చేసింది. తర్వాత ఆసిఫాబాద్ జట్టు 147 పరుగులకు ఆలౌట్ కావడంతో నిర్మల్ టీమ్ విజయం సాధించింది. మధ్యాహ్నం మంచిర్యాల, ఆదిలాబాద్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగగా... 27 పరుగుల తేడాతో మంచిర్యాల జిల్లా జట్టు గెలిచింది.
పాలమూరు జిల్లాలో ఉదయం మహబూబ్‌నగర్, గద్వాల జట్లు తలపడ్డాయి. మహబూబ్‌నగర్ జట్టు 184 రన్స్ చేసింది. గద్వాల 138కే ఆలౌట్ కావడంతో మహబూబ్‌నగర్ టీమ్ విజయం సాధించింది. మధ్యాహ్నం గద్వాల, వనపర్తి టీమ్స్ తలపడగా... గద్వాల 16 ఓవర్లలో 201 పరుగులు చేసింది. వనపర్తి 16 ఓవర్లలో 119 రన్స్ మాత్రమే చేయడంతో గద్వాల గెలుపొందింది.
నిజామాబాద్ జిల్లాలో ఉదయం నిజామాబాద్, కామారెడ్డి తలపడగా.. నిజామాబాద్ టీం 179 పరుగులు చేసింది. అనంతరం కామారెడ్డి టీం 18.2 బంతుల్లో 180 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లోనూ కామారెడ్డి, నిజామాబాద్ తలపడగా.. కామారెడ్డి టీం 88 పరుగులకే ఆలౌట్ అయింది. నిజామాబాద్ నాలుగు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి విజయం సాధించింది. నేడు నిజామాబాద్, కామారెడ్డి మధ్యే ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
