- ప్రేమ వ్యవహారంతో పరువు పోతుందనే కోపంతో దారుణం
- పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగులోకి..
- కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో ఘటన
కరీంనగర్/సైదాపూర్, వెలుగు: ప్రేమ వ్యవహారం కన్నకూతురి ప్రాణం తీసింది. తమ పరువు ఎక్కడ పోతుందోన్న కోపంతో తల్లిదండ్రులే కూతురిని దారుణంగా హత్య చేశారు. ఆపై చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆత్మహత్యగా చిత్రికరించి, పోలీసులకు చిక్కారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి వివరాల ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతుల కుమార్తె అర్చన (16) సోమారం మోడల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే నవంబర్ 15న తన ఇంట్లోనే అర్చన అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 14వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులమంతా భోజనం చేసి నిద్రపోయామని, 15న తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచి చూసేసరికి అర్చన నోట్లో నురుగు రావడం కనిపించిందని, దీంతో మృతి చెందినట్లు గుర్తించామని ఆమె తల్లిదండ్రులు సైదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్చనకు థైరాయిడ్, కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అవి భరించలేక ఆత్మహత్య చేసుకుందున్నారు. తమకు ఎవరి మీదా అనుమానం లేదని వారు పేర్కొన్నారు.
పోలీసు దర్యాప్తుతో పరువు హత్య వెలుగులోకి..
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం బయటపడింది. అదే గ్రామానికి చెందిన పోలు అనిల్(27) ప్రేమ పేరుతో బాలికను వేధించినట్లు గుర్తించారు. ఈ విషయంలో అమ్మాయి కుటుంబంలో కలహాలకు దారితీసినట్లు తేలింది. అర్చన వల్ల కుటుంబ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు ముందస్తు పథకం ప్రకారం అర్చనను హత్య చేశారు. రాత్రి నిద్రిస్తున్న బాలికకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. అయినా, కూతురు చనిపోకపోవడంతో తండ్రి రెడ్డి రాజు ఆమె గొంతు పిసికి హత్య చేశాడు. తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని.. రాజు, లావణ్యను అరెస్ట్ చేశారు.
