
- రాష్ట్ర కేబినెట్‌తో పాటు ధర్నాచౌక్‌కు..
- పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పోలీసులు, అధికారులు
- ధర్నా అనంతరం ప్రగతిభవన్‌కు వెళ్లిన సీఎం
- గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన మంత్రులు
హైదరాబాద్, వెలుగు: పండిన వడ్లన్నీ కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్కారు రోడ్డు మీదికొచ్చింది. గతంలో ఎత్తేస్తామన్న ధర్నా చౌక్‌లోనే సీఎం కేసీఆర్ గురువారం మూడు గంటల పాటు ధర్నా చేశారు. ఆయనతోపాటు మొత్తం రాష్ట్ర కేబినెట్ ఈ ధర్నాలో పాల్గొంది. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర లీడర్లు తరలివచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన నిర్వహించారు.
వడ్ల విషయంలో మొన్నటివరకు టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆందోళనలు చేయగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన చేపట్టింది. ధర్నాచౌక్ ఉన్న ఇందిరాపార్క్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్ దారిని చూపేలా ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి అసలు ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని, యాసంగిలో వరి సాగుపై క్లారిటీ ఇవ్వాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ చట్టాలతో వ్యవసాయ బావులకు మోటార్లు పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
వేదిక కింద కేటీఆర్.. వేదిక మీద కవిత
సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా వేదికపైన కూర్చోగా.. మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పార్టీ లీడర్లతో కలిసి కింద కూర్చున్నారు. ధర్నా ముగిసే వరకు ఆయన నేతలతో పలు అంశాలపై చర్చిస్తూ కనిపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పలుమార్లు నాయకులతో కలిసి నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇతర నాయకులతో కలిసి వేదికపై కూర్చున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా వినేది లేదని, తాను కలెక్టర్‌గా ఉన్నన్ని రోజులు వరి విత్తనాలు అమ్మొద్దని సీడ్ డీలర్లు, వ్యాపారులను హెచ్చరించిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా ధర్నాలో కనిపించారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఆయన కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వరి కంకులతో కూడిన డ్రెస్, నాగలితో ధర్నాకు వచ్చారు. కేసీఆర్‌కు ఆ నాగలిని బహుమతిగా ఇచ్చారు. టీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం, సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు.
ధర్నా నుంచి ప్రగతి భవన్‌కు కేసీఆర్
ధర్నా చౌక్‌లో ఆందోళన తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆయన ఆధ్వర్యంలోనే మంత్రులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తారని చెప్పినా.. సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. ముందుగా మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ రాజ్‌భవన్‌కు చేరుకోగా... మిగతా మంత్రులు, ఇతర నేతలు ప్రత్యేక బస్సులో అక్కడికి వచ్చారు. 11 మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వరిసాగు, ధాన్యం కొనుగోళ్ల గురించి వివరించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలన్నారు. 59 లక్షల ఎకరాల్లోనే రాష్ట్రంలో వరి సాగు చేసినట్టుగా కేంద్రం చెప్తోందని, అయినా కోటి టన్నులకు పైగా ధాన్యం పండుతుందని చెప్పారు. సెప్టెంబర్ 29న 59 లక్షల టన్నులు మాత్రమే కొంటామని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రానికి పంపాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన వివరించారు.