ఈటలపై నేను చెప్పినోళ్లే మాట్లాడాలి

ఈటలపై నేను చెప్పినోళ్లే మాట్లాడాలి

హైదారబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంపై ఎవరు పడితే వాళ్లు మాట్లాడొద్దని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వంపై ఈటల ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని, తాను చెప్పిన వాళ్లు మాత్రమే స్పందించాలని సూచించారు. కేబినెట్​లో పలు రాజకీయ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం. కేబినెట్​ మీటింగ్​ నుంచి ఆఫీసర్లు బయటికి వెళ్లగానే ఈటల రాజేందర్ విషయాన్ని ఎవరైన ప్రస్తావిస్తారా? అని మంత్రులు ఒకరి మొఖం మరొకరు చూసుకున్నట్టు తెలిసింది. ఇంతలోనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని.. ‘‘ఈటల రాజేందర్ విషయం గురించి ఏమనుకుంటున్నరు? ఆయనపై అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్న. ఎన్నో తప్పులు చేసినా ఇంతకాలం ఉపేక్షించిన. ఎవరు తప్పు చేసినా సహించ. ఎవరు పడితే వాళ్లు ఈటల మాటలకు కౌంటర్ ఇవ్వొద్దు. నేను చెప్పిన వాళ్లు మాత్రమే మాట్లాడాలి. హుజూరాబాద్ లో  పార్టీ బలంగా ఉంది. అక్కడ కొందరికి బాధ్యతలు అప్పగించిన. ఈటల ఎవరెవరినో కలుస్తుండు. కలిసి ఏం చేస్తడు? ఆయనతో ఏం కాదు’’ అని అన్నట్టు తెలిసింది. అదే సమయంలో ఏ లీడర్ ఎటు పోతుండు? ఏ మంత్రి ఏం చేస్తుండు? అనే పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రస్తావించగానే కొందరు మంత్రుల మోహం పాలిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.