కేసీఆర్​ వారికి మరోసారి దిశానిర్దేశం

కేసీఆర్​ వారికి మరోసారి దిశానిర్దేశం
  • పీఎఫ్సీ, ఆర్ఈసీ కొత్త నిబంధనలపై ఢిల్లీలో ఆఫీసర్లతో సమావేశం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల తీరుపై ఆరా

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పులు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) లిమిటెడ్ కొత్తగా పెట్టిన రూల్స్​పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  మంగళవారం ఢిల్లీలోని సీఎం తన అధికారిక నివాసంలో సీఎస్, ముఖ్య శాఖల సెక్రటరీలతో దాదాపు ఏడు గంటల పాటు చర్చించారు. మధ్యాహ్నం 1:20 నుంచి రాత్రి 8:40 వరకు ఈ భేటీ సాగింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ వినోద్, సీఎస్ సోమేశ్​ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, విద్యుత్ శాఖ సెక్రటరీ సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ హరిరాం, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ను కాదని పీఎఫ్సీ, ఆర్ఈసీలు కొత్తగా జోడించిన షరతులపై అధికారులతో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అప్పులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పీఎఫ్సీ, ఆర్ఈసీ లు గతంలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికే సగానికి పైగా అప్పులు ఇచ్చాయి. తాజాగా ఈ రెండు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకొన్న అగ్రిమెంట్ కు బదులు...  కేంద్రాన్ని చేర్చాలని రూల్ పెట్టినట్లు తెలిసింది.  అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులకు కేంద్ర సర్కార్ గ్యారంటీ కోరుతున్నట్లు సమాచారం. అప్పులు ఇస్తున్న కార్పొరేషన్లు కొత్తగా కేంద్రం జోక్యాన్ని కోరడం, అగ్రిమెంట్ ను మార్చుకోవడంపై ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే ఎఫ్ఆర్ బీఎం పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవాలని చెబుతున్న కేంద్రం వైఖరిపైనా చర్చ జరిగింది. అప్పుల సేకరణలో పలు రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు, కేంద్ర వైఖరిని ఆరా తీశారు. కాగా మరో రెండు, మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండవచ్చని సీఎంఓ వర్గాలు తెలిపాయి. 

పార్లమెంట్ లో వ్యూహంపై ఎంపీలకు నిర్దేశం

ఢిల్లీలో ఉన్న కేసీఆర్ ను మంగళవారం ఆ పార్టీ ఎంపీలు కలిశారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్​ వారికి మరోసారి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాగా రవీందర్ సింగ్ ను ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (ఎస్సార్) గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. త్వరలో బీఆర్ఎస్ పెడితే,  ఎస్సార్ గా రవీందర్ సింగ్ కు బాధ్యతలు అప్పగించవచ్చని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీలో మీటింగ్ పై అనేక సందేహాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే కేసీఆర్​ఢిల్లీలో సమీక్షా సమావేశం పెట్టడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  సీఎం ఢిల్లీ పర్యటనలో కేవలం రాష్ట్ర అంశాలు ముడి పడి ఉన్నాయా? లేక రాజకీయ అంశాలు కూడా దాగి ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.