వెలుగు ఓపెన్ ఓపెన్ పేజ్: వాణిజ్య భాగస్వామ్యంలో భారత్-అమెరికా కొత్త బంధం!

వెలుగు ఓపెన్ ఓపెన్ పేజ్: వాణిజ్య భాగస్వామ్యంలో భారత్-అమెరికా కొత్త బంధం!

అమెరికా– భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ ఆర్థిక రాజకీయాల్లో కీలక మలుపుగా భావించవచ్చు.  ప్రపంచంలో  వేగంగా ఎదుగుతున్న  రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న సుంకాల వివాదాలకు ఈ ఒప్పందం తాత్కాలికంగా తెరదించడమే కాకుండా..  ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు కొత్త దిశను సూచిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం  ఖరారైనట్లు  అధికారికంగా ప్రకటించారు.  

ఈ ఒప్పందం ప్రకారం భారత  ఉత్పత్తులపై  అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల  కారణంగా  భారత్‌‌‌‌‌‌‌‌పై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని కూడా  ఉపసంహరించుకోవడంతో  మొత్తం సుంకాల భారం గణనీయంగా తగ్గింది. 2024లో  అమెరికా– భారత్  ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 132 బిలియన్ డాలర్లకు  చేరుకోవడం ఈ సంబంధాల ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపుతోంది. 

అయితే ట్రంప్​ ప్రకటించింది టూకీ ఒప్పందమే కావచ్చు.  త్వరలో ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు పూర్తయ్యాక ఒప్పందం పూర్తి స్వరూపం తెలిసే అవకాశం ఉంది . 

రైతుల ప్రయోజనాలపై కేంద్రం ఇస్తున్న భరోసా!

ఈ ఒప్పందంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం.. వ్యవసాయ రంగంపై కేంద్రం   దృఢ వైఖరి ప్రకటించింది. కానీ అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఫైనల్​ డీల్​ కుదిరాకగాని పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. అదే సమయంలో   కోట్లాది రైతుల జీవనాధారమైన వ్యవసాయం,  పాడి రంగాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని  కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్​ గోయెల్​ ప్రకటించారు.   

బియ్యం,  చక్కెర, పాడి ఉత్పత్తులు, సోయాబీన్స్ వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులను సుంకాల తగ్గింపు పరిధి నుంచి తప్పించడం ద్వారా దేశీయ  రైతులను అకస్మాత్తుగా వచ్చే దిగుమతుల దెబ్బ నుంచి  కాపాడే ప్రయత్నం జరిగింది. ఇది రైతాంగానికి ఒక భరోసా సందేశంగా భావించవచ్చు. 

మార్కెట్లలో సానుకూల స్పందన

ఈ ఒప్పందం వార్త వెలువడగానే దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా స్పందించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో ముగియగా, రూపాయి విలువ కూడా డాలర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే బలపడింది. ఇది విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగినట్లు సూచిస్తుంది. తగ్గిన సుంకాల వల్ల భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పోటీ సామర్థ్యం పెరగనుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు,  శ్రమాధారిత పరిశ్రమలకు ఇది ఊరటనిచ్చే అంశం.

పరిశ్రమలకు అవకాశాలు – ముందున్న సవాళ్లు

వస్త్రాలు, లెదర్, రసాయనాలు, యంత్రాల రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ ఒప్పందాన్ని ఎగుమతి వృద్ధికి దోహదపడే అంశంగా స్వాగతించాయి.  ముఖ్యంగా  శ్రమాధారిత  పరిశ్రమలకు సుంకాల తగ్గింపు వల్ల గతంలో నిలిచిపోయిన ఆర్డర్లు తిరిగి రావచ్చని  పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  అయితే, ఒప్పందానికి సంబంధించిన పూర్తి చట్టపరమైన వివరాలు ఇంకా విడుదల కాలేదు. సుంకాల అమలు కాలపరిమితి, ఉత్పత్తుల పరిధి వంటి అంశాలు ఇంకా స్పష్టత పొందాల్సి ఉంది.  పూర్తి వివరాలు వెలువడే వరకు మార్కెట్ ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందన్న అంశంపై కొంత అనిశ్చితి కొనసాగనుంది.  

భౌగోళిక రాజకీయాల ప్రభావం  

ఆర్థిక అంశాలకు మించి,  ఈ ఒప్పందం  భౌగోళిక– రాజకీయ కోణంలో కూడా కీలకంగా మారింది.  రష్యా నుంచి  ఇంధన  దిగుమతులను తగ్గించేందుకు భారత్ అంగీకరించడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక వ్యూహాత్మక మార్పును  సూచిస్తోంది.  అమెరికా నుంచి ముడిచమురు కొనుగోళ్లు సాధారణంగా రష్యా చమురుతో  పోలిస్తే  ఖరీదైనవైనా..ఈ మార్పు భారత్–రష్యా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అదే సమయంలో భారత్,  అమెరికా  నేతృత్వంలోని  భౌగోళిక  కూటములకు  మరింత  దగ్గరవుతుండగా,  మాస్కోతో  దీర్ఘకాలిక  దౌత్య  సంబంధాలను  కొనసాగించే  ప్రయత్నం చేస్తోంది. ఇరుదేశాల అధికారుల ప్రకారం, ఇది తొలి దశ ఒప్పందం మాత్రమే. ఇది భవిష్యత్తులో మరింత విస్తృత వాణిజ్య సహకారానికి మార్గం వేయనుంది.

జీరో సుంకాలు, నాన్​– టారిఫ్ అడ్డంకుల తగ్గింపు ప్రభావం

అమెరికా ఉత్పత్తులపై ఎంపిక చేసిన రంగాల్లో సున్నా సుంకాల దిశగా  భారత్  అడుగులు వేయడం, అలాగే  క్లిష్టమైన  సర్టిఫికేషన్ నిబంధనలు, కస్టమ్స్ ఆలస్యాలు, నియంత్రణ అనుమతులు వంటి నాన్–టారిఫ్ అడ్డంకులను తగ్గించడం  మిశ్రమమైనా కానీ  వ్యూహాత్మక  ప్రభావాలను చూపనుంది.  ఒకవైపు పరిశ్రమలకు ముడి సరుకుల ఖర్చు తగ్గి, ఆధునిక సాంకేతికత, మూలధన వస్తువులు,  వైద్య పరికరాలకు ప్రాప్యత మెరుగుపడుతుంది. మరోవైపు, దేశీయంగా సున్నితమైన రంగాలు,  ఎంఎస్ఎంఈలపై  ప్రతికూల ప్రభావాలు లేకుండా జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.  

దేశీయ సామర్థ్యాలు, ఉత్పాదకత,  నాణ్యత ప్రమాణాలను బలోపేతం చేసే చర్యలతోనే ఈ విధానం విజయవంతమవుతుంది.  మొత్తంగా చూస్తే,  అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం భారత్‌‌‌‌‌‌‌‌కు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే సామర్థ్యం కలిగి ఉంది.  అయితే, ఈ అవకాశాలను దేశీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలంటే జాగ్రత్తగా అమలు చేయడం,  నిరంతర పర్యవేక్షణ,  రైతులు, చిన్న పరిశ్రమల రక్షణకు ప్రాధాన్యం అవసరం.  గ్లోబల్ వాణిజ్యంలో  భాగస్వామ్యం పెరుగుతున్నవేళ, జాతీయ ప్రయోజనాలు కేంద్రంగా ఉన్న విధానాలే  భారత్‌‌‌‌‌‌‌‌కు  దీర్ఘకాలిక లాభాలను తీసుకురాగలవు. 

- డాక్టర్​ రాధా రఘురామపాత్రుని,
అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు