జానారెడ్డి సవాల్​తో స్వయంగా రంగంలోకి దిగుతున్న సీఎం

V6 Velugu Posted on Apr 10, 2021

  • జానా కోసమే రెండోసారి సాగర్​కు కేసీఆర్
  • సీనియర్​ నేత కావడంతో ఎవరు విమర్శించినా ఆయనకే ప్లస్​అవుతోందట!
  • అందుకే కేటీఆర్​ రోడ్డు షో రద్దు చేశారని టాక్​
  • గతంలో ఎప్పుడూ లేనట్లుగా సాగర్​లో ప్రచారానికి రెండోసారి

నల్గొండ, వెలుగు: సాగర్​ఉప ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అమలుచేస్తున్న ఎన్నికల వ్యూహాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్​ నుంచి సీనియర్​ లీడర్​ జానారెడ్డి బరిలో ఉండడం, ఆయనను విమర్శించే స్థాయి నేత అధికార పార్టీలో  కేసీఆర్​ తప్ప ఇంకెవరూ లేకపోవడం వల్లే సీఎం రెండోసారి సాగర్​లో ప్రచారానికి రాబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి నేరుగా కేసీఆర్​ను టార్గెట్ చేసి పలు ఆరోపణలు చేయడమేగాక వాటికి ఆయన స్వయంగా ఆన్సర్​ ఇవ్వాలని కూడా సవాల్​ విసిరారు. అదీగాక ప్రస్తుతం టీఆర్ఎస్​ తరుపున ప్రచారం చేస్తున్న లీడర్లలో ఎవరు జానారెడ్డిని విమర్శించినా అది తమకే మైనస్​ అవుతోందని, అందువల్లే  కేసీఆర్​ పక్కా ప్లాన్​ ప్రకారం రెండోసారి టూర్​ పెట్టకున్నారని భావిస్తున్నారు. 

రెండోసారి ప్రచారానికి..
సీనియర్ ​నేత జానారెడ్డిని మంత్రి కేటీఆర్ విమర్శిస్తే అది రాజకీయంగా తమకు డ్యామేజీ అవుతుందని టీఆర్ఎస్​ హైకమాండ్​ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే 13,14 తేదీల్లో గుర్రం పోడు, హాలియా, పెద్దవూర మండలాల్లో నిర్వహించతలపెట్టిన రోడ్​షోను మంత్రి కేటీఆర్ క్యాన్సిల్​చేసుకున్నట్లు తెలుస్తోంది.  దీనిని బట్టి టీఆర్ఎస్ తన ఎన్నికల వ్యూహాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తుందో స్పష్టమవుతుంది. సాగర్​ నియోజకవర్గంలో జానారెడ్డి 11వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు జానారెడ్డిని విమర్శిస్తుంటే స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. అందువల్ల జానాను డైరెక్ట్​గా ఢీకొట్టాలంటే  సీఎం కేసీఆర్ రెండోసారి ఎంట్రీ ఇవ్వక తప్పదని మరో బహిరంగ సభకు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. 

కేసీఆర్ సభపైనే చర్చ
సాగర్​ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10న హాలియాలో జరిగిన బహిరంగ సభకు హాజరైన సీఎం కేసీఆర్ అనేక హామీలు గుప్పించారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి 14న హాలియాలోనే బహిరంగ సభ పెడ్తున్నారు. గతంలో ఒక నియోజకవర్గంలో ఇలా రెండుసార్లు ఎన్నికల ప్రచారానికి కేసీఆర్​వచ్చింది లేదు. దీనిని బట్టి సాగర్ ఎన్నికను కేసీఆర్ సీరియస్​గా తీసుకున్నట్లు అర్థమవుతోంది. కాగా, మొదటి సభలో ఎన్నికల హామీలు గుప్పించిన సీఎం కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే దానిపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన బహిరంగ సభలో జానారెడ్డి నేరుగా కేసీఆర్​ను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారు. సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి సాగర్​లో ఎప్పుడో జరిగిందని  గణాంకాలతో సహా జానారెడ్డి వివరించారు. అయితే తాను విసిరిన సవాల్​కు సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని, వేరేవాళ్లు చెబితే తాను అంతగా పట్టించుకోనని కూడా జానా అన్నారు. అందువల్ల 14న జరిగే సభలో కేసీఆర్ ప్రధానంగా జానారెడ్డిని టార్గెట్ చేసే అవకాశముందని భావిస్తున్నారు.

Tagged Nagarjunasagar bypoll, CM KCR, Sagar Byelection, Election Campaign

Latest Videos

Subscribe Now

More News