మునుగోడులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు:షర్మిల

మునుగోడులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు:షర్మిల

అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ 420 అని  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఒక్కో ఓటుకు వేల రూపాయలు ఇచ్చిన కేసీఆర్.. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. మునుగోడులో నల్లా తిప్పితే మంచినీళ్లకు బదులు లిక్కర్ వచ్చిందని ఆరోపించారు. సర్పంచ్ లు, ఎంపిటీసీలు, వార్డు నెంబర్లకు కార్లు, కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తే తప్పులేదు. కానీ బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఆయనకు తప్పుగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. 

రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడం లేదు

సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి..రైతు బంధుతో కోటీశ్వరులు అయిపోతారా అని నిలదీశారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే నష్టపరిహారం రైతులకు అందడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో రైతు బీమా ఇవ్వడం లేదని విమర్శించారు. 8 ఏండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 800 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేసిండు

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్..అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని షర్మిల స్పష్టంచేశారు. 8 ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదన్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..అందులో 20 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వమంటే హమాలీ పని చేసుకోవాలని ఓ మంత్రి ఉచిత సలహా ఇవ్వడంపై మండిపడ్డారు. నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్ గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రాజెక్టుల పేరుతో ప్రజా సొమ్మును దోచుకున్నరు

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేశారని షర్మిల ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సొమ్మును దోచుకున్నారని తెలిపారు. రూ. లక్షా 20 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 70 వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఇంత అవినీతి సొమ్మును వెనకేసుకున్నా విపక్ష నేతలు ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. కేసీఆర్ అవినీతిపై ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ ఒక్కటే అన్నారు. ఎక్కడ ముఖ్యమంత్రి అవినీతి బయటపడుతుందనే భయంతోనే రాష్ట్రంలోకి సీబీఐని రానివ్వకుండా రహస్యంగా జీవో తీసుకొచ్చారని ప్రశ్నించారు. షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 3 వేల కిటోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టారు.