ఒక దేశానికి లేదా తెలంగాణ లాంటి ఒక్క చిన్న రాష్ట్రానికో ఒక వ్యక్తిని దాని ఫాదర్ (పిత) ఫిగర్‌గా ప్రజలు గుర్తించాలంటే ఆ వ్యక్తికి కొన్ని మౌలిక అర్హతలు ఉండాలి. దురదృష్టవశాత్తు జాతిపిత చర్చల్లో మగవ్యక్తి గురించే చర్చ జరుగుతుంది. జాతిమాత (మదర్) గురించి అసలు చర్చలేదు. ఈవిధంగా దేశానికో లేదా రాష్ట్రానికి చరిత్ర మోరల్ ప్రతినిధిగా పురుషుడే ఉండక్కరలేదు. స్త్రీలు కూడా ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల్లో, ప్రాంతాల్లో చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషించినవాళ్లు ఉన్నారు. కానీ, వారికి గుర్తింపు రాలేదు. గద్దర్ గురించి రాసేటప్పుడు పురుషాధిపత్య సమాజ లక్షణం గురించి తెలిసి ఉండి కూడా ఈ వ్యాసం రాస్తున్నాను.
సాధారణంగా బానిసత్వంలో బంధించబడ్డ దేశాలు లేదా రాష్ట్రాలు విముక్తి పొందినప్పుడు ఆ విముక్తి పోరాటం పొడవునా ఒక వ్యక్తి నిర్వహించిన పాత్ర ఆ వ్యక్తి మోరల్ జీవితం, అతను లేదా ఆమెపడ్డ కష్టాలు, స్వార్థరహిత నిర్ణయాలు, ఆచరణలు కీలకమైన అంశాలుగా ఉంటాయి. ఆ వ్యక్తుల పోరాటపాత్ర విముక్తిలో ఒక బలమైన పాత్ర పోషించిన పాత్ర ఎంత సుదీర్ఘమైనది, ఆ పోరాట క్రమంలో ఆ వ్యక్తి జీవనవిధానం, నిర్మించిన తాత్విక చింతన అంతిమంగా అతను లేదా ఆమె చనిపోయేవరకు కూడా వేచిచూసి ఆ వ్యక్తిని ఆ జాతి గౌరవప్రద స్థానానికి ప్రకటించడం సరైనవిధానం.
మనదేశంలో 1948లో గాంధీ హత్య చేయబడ్డ తరువాతనే ఆయనకు జాతిపిత గౌరవం దొరికింది. అంతకుముందు మహాత్మా అనే బిరుదు ఉందికాని జాతిపిత బిరుదు లేదు. జ్యోతిరావు ఫూలేకు కూడా మహాత్మా బిరుదు ఉంది. నెహ్రూనో, సర్దార్ పటేల్నో జాతిపిత అని అనకపోవడానికి, గాంధీని అనడానికి కారణమేమిటి? గాంధీ అధికారంలో లేకుండా ఉద్యమ నాయకుడుగానే ఉంటూ హత్యకు గురికావడం. ఆయన స్వాతంత్ర్యం తరువాత కూడా తన కుటుంబీకులను అధికారంలోకి దింపకపోవడం, ఆస్తులు కుటుంబం కోసం సంపాదించకపోవడం వంటి అంశాలు దేశ ప్రజల దృష్టిలో ఉన్నాయి.
ఆయన సిద్ధాంత ప్రతిపాదనలతో అంగీకరించడం లేదా అంగీకరించకపోవడం వేరు. కానీ, ఆయన తనవంటి కొన్ని తాత్విక ఆలోచనలను దేశం ముందుంచి తీరాలి. కానీ, నెహ్రూ, పటేళ్లు పాలకులయ్యారు. నెహ్రూ అయితే తాను బతికి ఉండగానే ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని చేశాడు. కనుక ఒకవేళ గాంధీ అనే వ్యక్తి లేకపోయినా నెహ్రూను జాతిపితగా దేశం అంగీకరించకపోయేది కాదు. ఒకమేరకు సర్దార్‌పటేల్‌ను అంగీకరించేదేమో. కానీ, గాంధీకి వచ్చిన అంగీకారం ఆయనకు కూడా వచ్చేదికాదు.
తెలంగాణ ఉద్యమం
తెలంగాణ విముక్తి ఉద్యమం అని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వచించిన మొదటి దశ ఉద్యమం దగాపడి ఆగిపోయింది. రెండో దశ ఉద్యమం 1997 మార్చి 8, 9వ తేదీల్లో భువనగిరిలో జరిగిన సదస్సుతో మొదలైంది. దానిగురించి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను అడిగా చెప్పదేమిటి? మొట్టమొదటి భువనగిరి సభ దగాపడ్డ తెలంగాణ రెండో ఉద్యమానికి నాంది పలికింది అని, అందులో గద్దర్ తెలంగాణ విముక్తి గురించి ఉర్రూతలూగే ఆట, పాట, ఆయనకున్న ప్రజాదరణ చూశాకే ఆనాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏప్రిల్ 6న ఆయన గుండెల్లోకి 6 తుపాకి గుండ్లు దింపింది. ఐదుగుండ్లను డా.బీరప్ప బయటకు తీసినా ఒక గుండు
వెన్నుపూసలోనే ఉంటది. దాన్ని తీస్తే ప్రమాదం అని డాక్టర్ చెప్పాడు. ఆ డాక్టర్ ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్. ఆ గుండు వెన్నుపూసలో పెట్టుకుని 2023 ఆగస్టు 6 వరకు తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు గద్దర్.
నాథూరాం గాడ్సే గాంధీని జాతిపితకు అర్హున్ని చేస్తే చంద్రబాబు గద్దర్‌ను అర్హుణ్ని చేశాడు. గద్దర్ 1997లో చనిపోయి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. ఆయన గురించి ఈవిధమైన చర్చ ఉండేదికాదు. కానీ, ఆ తరువాత చనిపోయేవరకు తెలంగాణ కోసం, తెలంగాణ సంస్కృతి, కళలు, ఆర్థిక వెనుకబాటుతనం, ఆంధ్రాపాలకుల దోపిడీ, అణచివేత మీద నిరంతర రాతలు రాశాడు. పాడాడు. ఆడాడు. తిరిగాడు. పాదయాత్రలు చేశాడు. చివరికి చనిపోయింది కూడా కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొని, ఖమ్మం మీటింగ్‌లో ఆడి పాడి గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యాడు. ఆయన నిరాహారదీక్షలను, నిమ్మరసాల డ్రామాలను, హాస్పిటల్లో ఉండి ఆహార ఇంజెక్షన్లను ఎక్కించుకోలేదు. శరీరంలోని తుపాకీ గుండ్లు గుండెకి తెచ్చిన ప్రమాదంతో చనిపోయాడు.
ప్రజాయుద్ధ నౌక
ఆయన మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి, అదీ కుల సమస్యమీద విభేదాలతో, బయటకువచ్చాక కొత్త జీవితం మొదలెట్టాడు. వ్యక్తిగత జీవనంలో అంబేద్కరిజం–బుద్దిజం, పోరాట రంగంలో తెలంగాణను ఫ్యూడల్ పాలన నుంచి బయటకు తేవడానికి కొత్తరకం పోరాటం మొదలుపెట్టాడు. ఈ కొత్తరకం తెలంగాణ పోరాటంతో ఆయన మావోయిస్టు పార్టీకి రాజీనామా చేయడంతో బుద్దిస్టు–అంబేద్కరిస్టుగా మారడంతో ఆయన ‘ప్రజాయుద్ధ నౌక’ బిరుదు దశ కొత్త దశలోకి మారింది. ఆ ప్రజా యుద్ధనౌక బిరుదును కూడా మావోయిస్టు పార్టీ ప్రచారం చేయలేదు. దాన్ని ప్రచారంలోకి తెచ్చింది విప్లవ పార్టీలో కుల పోరాటం మొదలెట్టిన మారోజు వీరన్న. ఆ యువకుడు కూడా చనిపోయేవరకు తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని ఉర్రూతలూగించాడు.
ఆయనతో పాశం యాదగిరి, ధూంధాం ఆటపాటలతో తెలంగాణను కదిలించిన ఏకైక స్త్రీ కళాయోధురాలు విమలక్క. వందలాదిమంది విద్యార్థి పోరాట నాయకులు గద్దర్ చారిత్రక పోరాట పటిమకు బతికున్న సాక్ష్యాలు. ఈ మొత్తం పోరాట చరిత్ర ఆయనకు జాతిపిత అవడానికి రెండో అర్హతను కలిగించింది. కచ్చితంగా ‘తెలంగాణ జాతిపిత’ మూడోది ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చాక కూడా కుటుంబానికి రాజకీయ లబ్ధి, దాని మద్దతుతో ఆస్తుల సంపాదన చేయకపోవడం ఆయన చనిపోయేనాటికి ఆయన పిల్లలు వారి బతుకులు వారు బతుకుతుండడమే సాక్ష్యం. ఈ అంశం కూడా ఆయన్ని తెలంగాణ జాతిపిత అనే మోరల్ పదవికి అర్హుడిని చేసింది.
జాతిపిత చర్చ ఇప్పుడెందుకు ముందుకు వచ్చింది?
ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న కేసీఆర్ రాష్ర్టమంతటా తన బర్త్ డే పోస్టర్లలో ‘జాతిపిత కేసీఆర్’ అని రాయించుకుని కటౌట్లు, హోర్డింగులు, పోస్టర్లు వేయించుకున్నాడు. పైన నేను చెప్పిన సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి బ్యాక్‌గ్రౌండ్‌లో తానొక పార్టీ పెట్టుకుని తన కుటుంబాన్ని, బంధువులను అందులోకి దింపి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వగానే అధికారంలోకి వచ్చారు. 10 ఏండ్లు అన్నివిధాలుగా భూములు, ధనం, కుటుంబ పెత్తనం సంపాదించుకుని ఇప్పడు ఈ మోరల్ స్థానానికి తానే అర్హుడిని అని ప్రకటించుకున్నాడు. ఇది చాలా అహంకార సాహసం.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘నువ్వు ఎవరికి జాతిపితవు’ అని ఖండించి వదిలేశాడు. కానీ, తెలంగాణ జాతిపితగా ఒకరిని ప్రభుత్వం ప్రకటించకపోతే చారిత్రకంగా నిలిచిపోయే జాతిపిత అనే మోరల్ సీటులో కేసీఆర్ కూర్చుని ఉండిపోతాడు. ఈ సీటు పైసలు పెట్టి కొనేది కాదు. ఓటు ద్వారా గెలిచేది కాదు. కానీ, రాష్ట్ర చరిత్ర ఉనికిలో చాలా ముఖ్యమైంది. దానికి అర్హులెవ్వరో ప్రజాఉద్యమాలు నిర్ణయించి ప్రకటించాల్సిన అవసరం అందువల్లనే వచ్చింది.
గద్దర్ చైతన్యం..
మానవుల చైతన్యాన్ని మార్చడానికి బలమైన పాజిటివ్ సింబల్స్ నిరంతరంగా ప్రజల ముందు ఉండాలి. ఆ సింబల్స్‌కు తాత్విక, చైతన్య, పునర్జీవించగల శక్తి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వ శక్తి మనం డా. బీఆర్ అంబేద్కర్‌లో చూశాం. అందుకే దేశం ఆయనను మరిచిపోయింది అని అగ్రకులాలు భావించిన తరుణంలో 1990 మండల్ ఉద్యమం తరువాత అంబేద్కర్ తాత్విక, చైతన్యపు ఆవిర్బావం చెంది అంబేద్కర్ ఇప్పడు దేశంలోని అడుగు అడుగునా నిలబడి ఉన్నాడు.
ఆయన రచనలు ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన విగ్రహాలు జాతి సింబల్స్ అయ్యాయి. గద్దర్ చైతన్యం మరో రూపంలో తెలంగాణలో ఒక జాతిపిత రోల్ నిర్వహించగలదు. అయితే ఎంత ప్రభావవంతం అవుతుంది అనేది భవిష్యత్ తరాల్లో ఎదిగే యువ మేధావులపై ఉంటుంది. కానీ, నూతన చైతన్యం ఆరంభమైంది.
జాతిపితగా గద్దర్
రాష్ట్రాన్ని పదేండ్లు పాలించి దోచుకున్నాడని ప్రభుత్వమే చెబుతూ కేసీఆర్‌కు జాతిపిత సీటును వదిలేస్తున్న దశలో.. నాడు గద్దర్ మీద చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా కాల్పులు జరిపి గద్దర్ గుండెల్లోకి ఆరుగుండ్లు దించిన ఏప్రిల్ 6 తేదీన తెలంగాణ జాతిపితగా గద్దర్‌ను ప్రకటిస్తూ ఆయన పునర్జీవన సభ తెల్లాపూర్ విగ్రహం వద్ద ప్రజలు జరుపుతున్నారు. అందువల్ల తెలంగాణ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన సభ. గద్దర్ కంటే మెరిట్ కలిగిన వ్యక్తి తెలంగాణలో ఈ గుర్తింపునకు ఎన్నుకోదగ్గవారు లేరు. ఇక్కడ కులం, గద్దర్తో వ్యక్తులకు, సంస్థలకు ఉన్న భిన్నాభిప్రాయాలు అడ్డు రాకూడదు.
ఈ గౌరవం కూడా ఒక ఉద్యమకారునికి దక్కకుండా ఒక ఉద్యమకారునికి దక్కకుండా దాన్ని కేసీఆర్‌కే వదిలేస్తే తెలంగాణ చైతన్యరహితమైందిగా మారిపోతుంది. సాంస్కృతిక, చరిత్ర రంగాల్లోనైనా ఒక నూతన ఒరవడిని సృష్టించగల చైతన్యంలేని రాష్ట్రంగా ఉండిపోతుంది. తెలంగాణ వచ్చాక నేను రాసిన ఫ్యూడలిజం మల్లొచ్చింది పుస్తకంలో భవిష్యత్తులో పాత భూస్వామ్య శక్తులు తెలంగాణను ఏవిధంగా చైతన్యరహితగా మారుస్తాయో చెప్పాను.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.
