- ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం
- హానికర రంగులు, రసాయనాలతో ఐస్‌క్రీమ్స్
- రోగాలబారిన పడుతున్న పిల్లలు
నిర్మల్, వెలుగు: హానికర రంగులు.. రసాయనాలతో తయారవుతున్న ఐస్‌క్రీమ్స్‌పై గ్రామాలు పోరుబాటపట్టాయి. ఐస్‌క్రీమ్ బండ్లు ఊళ్లోకి రాకుండా నిర్మల్ జిల్లాలోని 15 పంచాయతీల్లో నిషేధం విధించారు. తోపుడు బండ్లు గ్రామాల్లోకి వస్తే రూ.5 వేల ఫైన్ వేస్తామని ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఐస్‌క్రీమ్ మార్కెట్‌కు భారీ ఎత్తున గిరాకీ ఉంటుంది. పిల్లలతోపాటు పెద్దలు సైతం సరదాగా ఐస్‌క్రీమ్ తినేందుకు ఆసక్తి చూపుతుంటారు.
దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు హానికర రంగులు, రసాయనాలు, పదార్థాలు కలుపుతూ లోకల్‌గా ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నారు. వీటిని తిన్న పిల్లలు ఒకటి, రెండు రోజుల్లోనే అస్వస్థతకు గురై దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు హానికర పదార్థాలు, రంగులతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్స్‌ను తినడం వల్ల క్యాన్సర్‌లాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియడంతో.. గ్రామస్తులు సమస్యను గ్రామ పంచాయతీ, విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ (వీడీసీ)ల దృష్టికి తీసుకువెళ్తున్నారు. దీంతో సమస్య తీవ్రతను గుర్తించిన నిర్మల్ జిల్లాలోని కొన్ని గ్రామాల పాలకవర్గ, వీడీసీ సభ్యులు తమ గ్రామాల్లో తోపుడు బండ్లపై వచ్చి ఐస్‌క్రీమ్ అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానాలు చేశారు.
- బ్యాన్ చేస్తూ తీర్మానాలు
కల్తీ ఐస్‌క్రీమ్‌ల అమ్మకాలపై నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాలు నిషేధాజ్ఞలు విధిస్తూ తీర్మానం చేస్తున్నాయి. పెంబి మండల కేంద్రంతోపాటు ఇదే మండలంలోని మందపల్లి, లోకేశ్వరం, దిలావర్‌పూర్ మండలంలోని గుండంపల్లి, నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ, లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్, పీచర, పొట్టపల్లి, ధర్మారం, కడెం మండలంలోని సారంగాపూర్, ఖానాపూర్ మండలంలోని బావాపూర్ తదితర గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్‌క్రీమ్ అమ్మకాలను ఇప్పటికే బ్యాన్ చేశారు. ఐస్‌క్రీమ్ వ్యాపారులు తమ గ్రామంలోకి రావొద్దంటూ గ్రామం మొదట్లోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైనా ఐస్‌క్రీమ్ అమ్మితే రూ. 5 వేల ఫైన్ విధిస్తామని, తినే వారికి జరిమానా విధిస్తామంటూ హెచ్చరించారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మరికొన్ని గ్రామాలు సైతం అదే బాటలో నడుస్తున్నాయి.
- మా ఊరికి సమస్యగా మారింది
కల్తీ ఐస్‌క్రీమ్‌లు మా గ్రామానికి సమస్యగా మారాయి. ఎండాకాలంలోనే కాకుండా ఇతర సీజన్లలో కూడా కొంత మంది తోపుడు బండ్లపై తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఐస్‌క్రీమ్‌లు అమ్మొద్దని చెబుతుంటే మాట వినడం లేదు. గ్రామంలోని చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గ్రామపంచాయతీ ద్వారానే కాకుండా వీడీసీ సభ్యుల సహకారంతో నిషేధం విధించాం. ఐస్‌క్రీమ్‌లు తినడంతో పిల్లలు, పెద్దలు సైతం దగ్గు, జ్వరాలకు గురవుతున్నారు.
- చెన్న వసంత, సర్పంచ్, గొల్లమాడ గ్రామం, నిర్మల్ జిల్లా
- ముందు జాగ్రత్తగానే నిర్ణయం
ఐస్‌క్రీమ్‌లలో కలిపే ఫ్లేవర్స్, రంగుల కారణంగా క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాం. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. మా గ్రామంలోకి ఎవరైనా తోపుడు బండ్లపై వచ్చిగానీ.. కిరాణ దుకాణాల్లో గానీ కల్తీ ఐస్‌క్రీమ్‌లను అమ్మితే జరిమానా విధించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
- లింగాల శ్రీనివాస్, ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘ నేత, గొల్లమాడ
