- మేము మొదటి నుంచీ ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాం: మంత్రి వివేక్
- రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ను బాల్క సుమన్ బద్నాం చేసిండు
- బీఆర్ఎస్వాళ్లది బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర
- గోదావరిఖనిలో గన్‌పెట్టి బెదిరించిన సంగతి ఎవరూ మరిచిపోలే
- చెన్నూరులో హింసను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలో పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌చైర్‌పర్సన్, వైస్చైర్పర్సన్ఎన్నిక నేపథ్యంలో మంత్రి స్పందించారు. తాము మొదటి నుంచి ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించామని, కానీ బాల్క సుమన్, బీఆర్ఎస్ లీడర్లు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
హింసను ప్రోత్సాహించే బాల్క సుమన్ వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించని వాళ్లను బట్టలిప్పి కొడతానని వ్యాఖ్యలు చేసినందుకే ఆయనకు చెన్నూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. మళ్లీ అదే తీరుతో వ్యవహరిస్తే ఈసారి గట్టిగా బుద్ధి చెప్తారన్నారు. సుమన్ చెన్నూరులో హింసను ప్రోత్సాహిస్తే ఊరుకునేది లేదని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
బాల్క సుమన్ హయాంలో ఏ ఎన్నికా సక్రమంగా జరగలేదని, ఆయనది బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర అని మండిపడ్డారు. బీఆర్ఎస్ గూండాలను పెట్టుకొని అభ్యర్థులను నామినేషన్వేయకుండా, బెదిరింపులు, డబ్బులతో మభ్యపెట్టారన్నారు. గోదావరిఖనిలో ఏకంగా గన్‌పెట్టి బెదిరించి గెలిపించుకున్న చరిత్ర బీఆర్ఎస్పార్టీదన్నారు. బాల్క సుమన్ లాగా బెదిరింపు, రౌడీ రాజకీయాలు తాము చేయలేదని, చేయబోమన్నారు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చాయన్నారు.
చైర్ పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు రాకపోవడంతో మొదటి రోజు వాయిదా పడిందని, రెండో రోజు తాను, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కలిసి మున్సిపల్ ఆఫీసుకు ఓటు వేసేందుకు వెళ్తుండగా తమ కాన్వాయ్‌పై బీఆర్ఎస్వాళ్లు రాళ్లతో దాడిచేశారన్నారు. తమపై రాళ్లు, ట్రాఫిక్ కోన్లతో దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని, చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కొత్తగా ఎన్నికైన క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి, వైస్చైర్పర్సన్సరితకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.
చెన్నూరులో గోదావరి వెంట శాశ్వత ఘాట్లు
చెన్నూరు ప్రాంతంలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో జరుపుతామని, గోదావరి నది వెంట శాశ్వత ఘాట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కార్మిక,గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం గోదావరి నది తీరంలోని ఉత్తరవాహిని పుష్కరాల ఘాట్ ఏర్పాటు ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కూడా కోరుతున్నారన్నారు. ఇటీవల మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో గోదావరి పుష్కరాల నిర్వహణ, గతంలో జరిగిన కాళేశ్వరం పుష్కరాల సందర్భంగా చెన్నూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించని విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
లక్షల్లో భక్తులు చెన్నూరు ప్రాంతంలోని పుష్కరాలకు తరలివస్తారని, టైర్-2 నుంచి ఈ ప్రాంతాన్ని టైర్-1జాబితాకు చేర్చాలని సీఎం, పుష్కరాల సబ్‌కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్‌బాబును కోరడంతో సానుకూలంగా స్పందించారన్నారు. చెన్నూరు గోదావరి పుష్కరాలను టైర్-1 జాబితాలో చేర్చిన సీఎం, మంత్రి శ్రీధర్‌బాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా కొత్తగా మంజూరైన ఫేజ్-2 మైన్ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని మంత్రి పరిశీలించారు.
