ప్రాజెక్టుల నుంచి నీళ్లు.. వర్షాలు పడితేనే

ప్రాజెక్టుల నుంచి నీళ్లు.. వర్షాలు పడితేనే
  • వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం
  • ఆగస్టు దాకా వానలు పడకపోతే ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి లిఫ్ట్​

హైదరాబాద్, వెలుగు: వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్​ఇంజనీర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టుకు సాగు నీటి విడుదలకు కొద్ది రోజులు విరామం ఇవ్వాలని చెప్పారు. రుతుపవనాలు ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో.. వానాకాలం సీజన్‌‌లో ప్రాజెక్టుల కింద సాగునీటి విడుదలపై సోమవారం సెక్రటేరియెట్‌‌లో సీఎం హై లెవల్​కాన్ఫరెన్స్​నిర్వహించారు. జులై మొదటి వారం వరకు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నదని, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘రాష్ట్రంలోని రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ధ్యేయం. 

వర్షాభావ పరిస్థితుల వల్ల సాగుకు అంతరాయం లేకుండా నీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి. అందుకోసం ఎంత ఖర్చయినా పర్వాలేదు.. పంటలు కాపాడాలి” అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మిషన్ భగీరథ, ఇతర తాగునీటి పథకాలకు నీటి లభ్యతపై ఆరా తీశారు. జులై మొదటి వారంలో కురిసే వర్షాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను బట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

ఎస్సారెస్పీపై ఆగస్టు వరకు వేచి చూద్దాం

సిద్దిపేట సమీపంలో రంగనాయక సాగర్‌‌‌‌లో 0.69 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయని.. మిడ్ మానేరు నుంచి తక్షణమే రెండు టీఎంసీలు ఎత్తిపోయాలని ఆదేశించారు. తద్వారా దీని కింద ఆయకట్టుకు వానాకాలం సీజన్​కు నీళ్లివ్వగలుగుతామన్నారు. నిజాంసాగర్​లో ఇప్పుడు 4.95 టీఎంసీలు నిల్వ ఉన్నాయని, ఇవి ఆగస్టు చివరి వరకు మూడు తడులు ఇచ్చేందుకు సరిపోతాయని ఇంజనీర్లు తెలిపారు. ఆ తర్వాత ఇంకో మూడు తడులు ఇవ్వాలంటే మరో ఐదు టీఎంసీలు అవసరమవుతాయని వివరించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్‌‌‌‌కు ఆ ఐదు టీఎంసీలు తరలించాలని సీఎం సూచించారు. ఆగస్టు వరకు వేచి చూసి అప్పటికీ శ్రీరాంసాగర్​ప్రాజెక్టుకు వరద రాకుంటే.. 

ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా 35 టీఎంసీల వరకు లిఫ్ట్​చేయాలని సూచించారు. మల్లన్నసాగర్​లో ఈ ఏడాది ఇంకో పది టీఎంసీలు నింపాలని ఆదేశించారు. వానాకాలం ముగిసి అన్ని రిజర్వాయర్లకు ఇన్​ఫ్లోలు తగ్గిన తర్వాత కాళేశ్వరం వద్ద గణనీయంగా ప్రవాహాలుంటాయని, రెండో పంట కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, మిడ్​మానేరు, ఎల్ఎండీ, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్​లలో నిల్వ చేయాలన్నారు. ఇందుకోసం ఎన్ని పంపులు రన్​చేయాలనే దానిపై ఆపరేషన్​మ్యానువల్​తయారు చేయాలన్నారు. ఈ ఏడాది తలెత్తిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ ​సిద్ధంగా ఉండాలన్నారు.

ఈనెల 26 నుంచి రైతుబంధు

వానాకాలం సీజన్ పంట పెట్టుబడి కోసం రైతులకు ఈనెల 26 నుంచి నిధులు విడుదల చేయాలని మంత్రి హరీశ్​రావు, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 24 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, అవి పూర్తి కాగానే పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతుబంధు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డి, గంగుల కమలాకర్ ​తదితరులు పాల్గొన్నారు

తాగునీటి కోసమే పాలమూరు ఎత్తిపోతలు

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాగునీటి కోసమే ఆగస్టు చివరి నాటికి పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్​స్కీం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్​రిజర్వాయర్లలో పాలమూరు నుంచి ఎత్తిపోసే నీటిని నిల్వ చేయాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి సమర్థులైన కాంట్రాక్టర్లకు ఆ పనులు అప్పగించాలన్నారు. మిడ్​మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్​కు తాగునీటి కోసం నీళ్లు ఎత్తిపోయాలని సూచించారు. ఆ రిజర్వాయర్​కింద ఆయకట్టుకు నీళ్లు విడుదల చేసేలా కాల్వల తవ్వకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్ధా బ్యారేజీ ప్రాజెక్టుకు రూ.4,252.33 కోట్లతో ప్రపోజల్స్​పంపామని, సీడబ్ల్యూసీ ఈ ప్రాజెక్టు డీపీఆర్​పరిశీలించే ప్రక్రియ ప్రారంభించిందని ఈఎన్సీ మురళీధర్​తెలిపారు. ఈ ప్రాజెక్టుకు వెంటనే అడ్మినిస్ట్రేటివ్​శాంక్షన్​ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.