వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరిస్తాం

వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరిస్తాం

హైద‌రాబాద్‌: అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలు తామంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునేలా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారని అన్నారు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి. రాష్ర్టంలో వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ర్టేష‌న్ల‌పై ప్ర‌శాంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో క్ర‌య విక్ర‌యాలు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌న్న‌దే సీఎం కేసీఆర్ అభిమ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు. రియ‌ల్ ఎస్టేట్‌కు ఎలాంటి ఆటంకాలు క‌ల‌గ‌రాద‌ని సీఎం స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. 100 రోజుల విరామం తరువాత సీఎస్, అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారని, మంచి పోర్టల్ ను తీసుకు వచ్చారన్నారు. చిన్న చిన్న అవరోధాలు అధిగమిస్తూ ముందుకు పోతున్నామ‌ని, సూచనలు, సలహాలు తీసుకుని అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నామ‌ని చెప్పారు.

ర‌ద్దీ ఆధారంగా రిజిస్ర్టేష‌న్ల కార్యాల‌యాల‌ను నాలుగు విభాగాలుగా చేశామ‌న్నారు. బాగా డిమాండ్ ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే కార్యాలయాలుగా వర్గీకరించామని అన్నారు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి. ర‌ద్దీ ఉన్న కార్యాల‌యాల‌కు ఎక్కువ మంది రిజిస్ర్టార్లు, సిబ్బందిని నియ‌మిస్తామ‌ని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ర్టేషన్ల‌ను వేగ‌వంతంగా పూర్తి చేస్తామ‌న్నారు. మార్చి వ‌ర‌కు ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. రిజిస్ర్టేష‌న్ల‌కు సంబంధించి అన్ని వ‌ర్గాల నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించాం.. వారం రోజుల్లో అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.