ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా వజ్రోత్సవాలు

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా వజ్రోత్సవాలు

హైదరాబాద్:  స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు ‘‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ’’ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా నిర్వహించే కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ఎంపీ కె.కేశవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు, అదేవిధంగా జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు పాఠశాల విద్యార్థుల కోసం థియేటర్లలో సినిమాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, సీఎస్, డీజీపీ, నారదాసు లక్ష్మణ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ’ లో భాగంగా నిర్వహించే రోజు వారీ కార్యక్రమాలు :

ఆగస్టు 08 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం ’  ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం.
ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు
ఆగస్టు 11 :  ఫ్రీడం రన్ నిర్వహణ
ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక  వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
ఆగస్టు 14 : సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు
ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
ఆగస్టు 16 : తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ.
ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ.
ఆగస్టు 18 : ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణ
ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు
ఆగస్టు 21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం
ఆగస్టు 22 : ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు