నిఖత్, ఇషాలకు సీఎం కేసీఆర్ సన్మానం..

నిఖత్, ఇషాలకు సీఎం కేసీఆర్ సన్మానం..

విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. అంతకుముందు పబ్లిక్ గార్డెన్ లో జరిగిన వేడుకల్లో ఘనంగా వారిని సన్మానించి, చెరో రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ వారిని వారి తల్లిదండ్రులను ప్రగతి భవన్ కు ఆహ్వానించి ఆతిద్యం ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి సీఎం భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. 

బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, తాను గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్ జరీన్ ను సీఎం అడిగి తెలుసుకున్నారు. స్వయంగా  క్రీడాకారుడైన తన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ, ప్రోత్సాహం గురించి నిఖత్ సీఎంకు వివరించారు. తాను బాక్సింగ్ లో శిక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక సమయంలో అన్ని విధాలా సాయం అందించినందుకు సీఎం కేసీఆర్ కు నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపారు. 

నిఖత్ పట్టుదలను ఆత్మస్థైర్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా మానసికంగా ధృఢంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా, నిఖత్ జరీన్ ఇషా సింగ్ లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్పూర్తి పొందాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.