తెలంగాణ బిడ్డలే రైళ్లను తయారు చేస్తున్నరు

తెలంగాణ బిడ్డలే రైళ్లను తయారు చేస్తున్నరు

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేధా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్‌ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు.ఈ సందర్భంగా మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు గర్వకారణమన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుని టీఎస్ ఐపాస్ పాలసీని తీసుకొచ్చామన్నారు. అధికారుల టేబుల్ పై ఫైల్ ఆగితే రోజుకు వెయ్యి రూపాయల ఫైన్ వేస్తున్నామని చెప్పారు.

 రూ. 2500 కోట్లతో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫేజ్ వన్ పనులు పూర్తి చేసి తనతో ప్రారంభింపచేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.  తెలంగాణ బిడ్డలే దేశానికి , ప్రపంచానికి అవసరమైన రైళ్లను తయారు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఫార్మా, పౌల్ట్రీ ఇండస్ట్రీలు పెరిగాయని...జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి అందిస్తున్నామన్నారు.  మేధా అనుబంధంగా మలేషియాకు చెందిన మరోసంస్థ వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 70 నుంచి 80 దేశాల విధివిధానాలను పరిశీలించామన్నారు. ముంబై నుంచి మోనో రైలు ఆర్డర్ వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో మొత్తం ఇక్కడే రైలు మొత్తం తయారవుతుందన్నారు. 

దేశంలోనే అతి పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో ప్రతీ ఏడాది 500 కోచ్ లు, 50 లోకో మోటవ్ లను ఉత్పత్తి చేయవచ్చు.