
- ఇటు పార్టీ, అటు ప్రభుత్వ పనుల్లో హరీశ్ బిజీ బిజీ
- ఆరోగ్య శాఖలో కీ రోల్.. ప్రగతి భవన్‌లోనే అడ్డా
- అన్ని రివ్యూలకు ఆహ్వానిస్తున్న కేసీఆర్
- కీలకమైన కమిటీల్లో చోటు..హుజూరాబాద్ బాధ్యతలు
- నిన్న మొన్నటి వరకు హరీశ్‌తో అంటీముట్టనట్టు..
- ఈటల బర్తరఫ్‌తో సీన్ చేంజ్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మేనల్లుడు, టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొదలైన ఆయన హవా ఈటల ఇష్యూ తర్వాత పీక్కు చేరింది. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గంలోంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచీ ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ హరీశ్‌కు ప్రాధాన్యం పెరిగింది. కేసీఆర్ కీలకమైన పనులన్నీ హరీశ్‌కే అప్పగిస్తున్నారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ప్రయారిటీ తగ్గింది. పార్టీ రాజకీయాలకు బదులు ఆయన సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. మూడేండ్లుగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలకు హరీశ్‌రావు దూర దూరంగా ఉన్నారు. తన కుమారుడు కేటీఆర్‌కు పాలనా పగ్గాలు అప్పగించే ఆలోచనతో కేసీఆర్ కావాలనే హరీశ్‌ను దూరం పెట్టినట్లు ప్రచారం జరిగింది. కానీ.. ఇటీవలి పరిణామాలతో టీఆర్ఎస్లో సంస్థాగత మార్పులు కనిపిస్తున్నాయి. అటు పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కేటీఆర్‌కు బదులుగా హరీశ్‌కు కేసీఆర్ పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీలు, కీలకమైన మీటింగ్‌లు, పార్టీ తరఫున చేపట్టే ఆపరేషన్లన్నీ హరీశ్‌కు అప్పగించడాన్ని చూస్తే ఇది స్పష్టమవుతోంది. శాఖాపరమైన రివ్యూలన్నింటా హరీశ్ ప్రత్యక్షమవుతుంటే, సోషల్ మీడియా ట్వీట్లు, ప్రారంభోత్సవాల్లోనే కేటీఆర్ కనిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు కూడా కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈటల ఇష్యూలోనూ నో కామెంట్ అంటూ కేటీఆర్ దాటవేయటం గమనార్హం.
ఈటల బర్తరఫ్‌తో మారిన సీన్
ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ప్రగతి భవన్‌లోని మీటింగ్‌లు, రివ్యూలన్నింటికీ హరీశ్‌రావును సీఎం కేసీఆర్ పిలుస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాన్ని కుదిపేయటంతో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున పనులు చక్కదిద్దే బాధ్యతలను హరీశ్‌కు అప్పగించారు. హాస్పిటళ్లలో మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను సమీక్షించేందుకు ఆయన నేతృత్వంలోనే కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈటలను పంపించేయడంతో ఖాళీ అయిన ఆరోగ్య శాఖను మంత్రి హరీశ్‌రావుకు అప్పగిస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ శాఖ కేసీఆరే దగ్గరే ఉంది. దీంతోపాటు రేషన్ డీలర్ల కమీషన్, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీలోనూ హరీశ్‌కు చోటు కల్పించారు. ప్రస్తుతం హరీశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కుటుంబీకుడు కావటంతో పార్టీ వ్యవహారాలన్నింటిలోనూ కేసీఆర్‌కు నమ్మిన బంటు అనే ముద్ర ఆయనపై ఉంది. ఉద్యమ నేతగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, పార్టీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఈటల రాజేందర్‌ను సాగనంపటం ద్వారా ఉద్యమ నేతలను పార్టీ నుంచి పంపిస్తున్నారనే చెడ్డపేరు రాకుండా.. కేసీఆర్ మళ్లీ హరీశ్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
చేదు రిజల్ట్స్‌తో రీ ఎంట్రీ
రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీ మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరుగుతూవచ్చింది. కేసీఆర్ కనుసన్నల్లో ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలన్నింటిలోనూ కేటీఆర్ జోక్యం పెరిగింది. సీఎంకు బదులుగా తానే యాక్టింగ్ సీఎం హోదాలో ఆఫీసర్లు, మంత్రులందరితో కేబినెట్ తరహా రివ్యూలు నిర్వహించారు. ఇదే టైమ్‌లో వచ్చిన జీహెచ్ఎంసీ ఎలక్షన్ బాధ్యతలను కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కే అప్పగించారు. కానీ ఈ ఎన్నికల్లో చేదు ఫలితం రావటం, ఒక్కసారిగా రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవటంతో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో టీఆర్ఎస్కు పెద్ద డ్యామేజీ జరిగిందని, పార్టీ నేతల్లో క్రమశిక్షణ అదుపు తప్పిందని కేసీఆర్ గుర్తించారు. అందుకే ఆయన స్వయంగా మళ్లీ పార్టీ వ్యవహారాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గీత దాటుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను బండకేసి కొడుతానని వార్నింగ్ ఇచ్చి తన లైన్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. సాగర్ బై ఎలక్షన్‌తో పాటు, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ పర్యవేక్షించారు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార పర్వం, పోలింగ్ వరకు నిత్యం పార్టీ లీడర్లతో ఫోన్లలో మాట్లాడుతూ పావులు కదిపారు. ఈ టైమ్‌లోనే కేసీఆర్ మళ్లీ హరీశ్ రావును తెరపైకి తెచ్చారు. హైదరాబాద్–రంగారెడ్డి సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపిన పీవీ కూతురు వాణీదేవిని గెలిపించే బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వరుసగా రెండు ఎమ్మెల్సీ సీట్లు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే సీటును టీఆర్ఎస్ గెలుచుకుంది. అప్పట్నుంచీ పార్టీ వ్యవహారాలు, ఎలక్షన్ బాధ్యతల నుంచి కేటీఆర్‌ను మెల్లమెల్లగా సైడ్ ట్రాక్‌లో పెట్టినట్లు ప్రచారంలో ఉంది.
ఆపరేషన్ హుజూరాబాద్‌లోనూ..
ఈటల రాజేందర్ రాజీనామాతో రాబోతున్న హుజూరాబాద్ బై ఎలక్షన్‌కు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే హరీశ్‌రావుకు ‘ఆపరేషన్ హుజూరాబాద్’ బాధ్యతను కేసీఆర్ అప్పగించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఉద్యమ నేత ఈటలకు బీసీలతో పాటు అన్ని వర్గాల్లో గట్టి పట్టుంది. అందుకే ఉద్యమ సహచరుడు, ఈటలకు సంబంధించిన గుట్టు మట్టులన్నీ హరీశ్‌కు తెలుసని పార్టీ నేతలు చెప్తున్నారు. అదే నమ్మకంతో ఈటలను బర్తరఫ్ చేసిన మరుసటి రోజే హరీశ్‌ను మళ్లీ ప్రగతిభవన్ కు కేసీఆర్ పిలిపించుకున్నట్లు చర్చించుకుంటున్నారు.