
- హైదరాబాద్‌లో దవాఖాన్లకు ముగ్గుపోసుడుతోనే సరిపెడ్తున్న సర్కారు
- వాటిని కట్టిందీ లేదు.. కార్పొరేట్ వైద్యం అందించిందీ లేదు
- మూడు టిమ్స్‌ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి 14 నెలలాయె
- ఒక్కో దాంట్లో వెయ్యి బెడ్లన్నరు.. ఎయిమ్స్ లెక్క సేవలన్నరు
- ఇప్పటికీ పునాదులు కూడా పూర్తి కాలే
- ఏడాది నుంచి ఊరిస్తూ ఇప్పుడు నిమ్స్‌లో కొత్త బిల్డింగ్‌కు భూమిపూజ
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మళ్లో కొబ్బరికాయ కొట్టారు. ఆ మధ్య మూడు టిమ్స్‌ల కోసం.. ఇప్పుడు నిమ్స్‌లో కొత్త బిల్డింగ్ కోసం! కొబ్బరికాయలు కొట్టుడుతోనే సరిపోతున్నది కానీ.. వాటిని కట్టింది లేదు, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిందీ లేదు. నిమ్స్‌లో 2 వేల బెడ్ల కెపాసిటీతో బిల్డింగ్ నిర్మిస్తామని ఏడాది నుంచి ఊరిస్తూ.. ఎట్టకేలకు బుధవారం భూమి పూజ చేశారు. అయితే, హైదరాబాద్‌లో గతంలో కేసీఆర్ కొబ్బరికాయలు కొట్టి ముగ్గుపోసిన దవాఖాన్ల బిల్డింగ్స్ పనులు ఇప్పటికీ కనీసం పిల్లర్ల వరకు కూడా రాలేదు. ఇప్పుడీ నిమ్స్ కొత్త బిల్డింగ్ ఎన్నడు పూర్తవుతుందోనని హెల్త్ ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘‘అరవయ్యేండ్ల ఉమ్మడి పాలనలో హైదరాబాద్‌లో దవాఖాన్ల అవసరాన్ని పట్టించుకోలేదు. నిజాం కాలంలో కట్టిన గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే తప్ప కొత్త దవాఖాన్లు కట్టనే లేదు” అంటూ వందలసార్లు బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు విమర్శించారు. తొమ్మిదేండ్ల నుంచి తెలంగాణను పాలిస్తున్న కేసీఆర్ సర్కార్ కూడా ఇప్పటివరకు ఒక్క పెద్ద దవాఖానను కూడా నిర్మించలేదు. ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలతోపాటు సమీప జిల్లాల ప్రజలకు అవే హాస్పిటళ్లు పెద్దదిక్కుగా ఉన్నాయి.
తొమ్మిదేండ్ల నుంచి తెలంగాణను పాలిస్తున్న కేసీఆర్ సర్కార్ కూడా ఇప్పటివరకు ఒక్క పెద్ద దవాఖానను కూడా నిర్మించలేదు. ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలతోపాటు పరిసరాల జిల్లాల ప్రజలకు కూడా అవే హాస్పిటళ్లు పెద్దదిక్కుగా ఉన్నాయి.
ఆ మూడు టిమ్స్‌లు ఎక్కడిదాకొచ్చె?
నిరుడు ఏప్రిల్ 26న అల్వాల్, సనత్‌నగర్, కొత్తపేటలో మూడు టిమ్స్‌ల (సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల) నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. ఒక్కో హాస్పిటల్‌లో వెయ్యి బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయని ప్రకటించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో ఈ దవాఖాన్లలో 16 రకాల స్పెషాలిటీ, 15 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, ఇక ప్రజలు ప్రైవేటు దవాఖాన్లకు పోవాల్సిన అవసరమే ఉండదని భూమిపూజ చేసినప్పుడు స్పీచ్‌లో కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇది జరిగి 14 నెలలు అవుతున్నా, ఒక్క దవాఖాన కూడా అందుబాటులోకి రాలేదు. కనీసం పునాది పనులు కూడా పూర్తి కాలేదు. ఒక్క టిమ్స్ కూడా కట్టకముందే, కొన్ని వేలసార్లు వీటి గురించి సర్కార్ ప్రచారం చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది.
గచ్చిబౌలి టిమ్స్ బంద్
కరోనా సమయంలో సర్కార్ దవాఖాన్లలో బెడ్లు దొరక్క అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను దవాఖానగా మార్చాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దీనికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు కడ్తమన్న హామీని, ఈ టిమ్స్‌తో నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను హాస్పిటల్‌గా మార్చేందుకు కోట్లు ఖర్చు చేశారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్ల నుంచి గచ్చిబౌలికి డాక్టర్లను, స్టాఫ్‌ను డిప్యుటేషన్ మీద పంపించారు.
కరోనా తగ్గగానే టిమ్స్‌లో ఐపీ సేవలు బంద్ పెట్టారు. ఆ తర్వాత క్రమంగా ఆ దవాఖానకు క్లోజ్ గేట్ పెట్టేశారు. అడిగితే రెనోవేషన్ పనులు జరుగుతున్నాయని చెప్తూ మేనేజ్ చేస్తున్నారు. రెండేండ్ల నుంచి రెనోవేషన్ ఏం చేస్తున్నరని ప్రశ్నిస్తే.. సమాధానం ఉంటలేదు. ఆఫీసర్లు మాత్రం ఇక గచ్చిబౌలి టిమ్స్ కథ ముగిసినట్టేనని ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు.