సీఎం జాబ్స్ మాట.. ఎమ్మెల్యేల కోచింగ్ పాట

సీఎం జాబ్స్ మాట.. ఎమ్మెల్యేల కోచింగ్ పాట

 

  • నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు

వెలుగు, నల్గొండ/వరంగల్: ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్​ఇటీవల అసెంబ్లీ వేదికగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించడమే ఆలస్యం, నిరుద్యోగులకు తాము ఫ్రీ కోచింగ్​ఇస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. ఆకర్షణీయ ప్రకటనలతో సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు. మంత్రి జగదీశ్​రెడ్డి లాంటి వారైతే స్టడీ మెటీరియల్​కూ ఆర్డర్​ ఇచ్చేసినట్లు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్​లైన్​పై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇన్నాళ్లూ నోటిఫికేషన్లు లేక యూత్​ ముఖ్యంగా 25–45 ఏజ్​గ్రూపులో రూలింగ్​పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని టీఆర్ఎస్​ నిర్వహించిన పలు సర్వేల్లో తేలింది. రాబోయేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ ఏజ్​గ్రూపును ఆకట్టుకునేందుకే ఇన్నేళ్ల తర్వాత సీఎం జాబ్​ నోటిఫికేషన్లు అంటుంటే దానిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎమ్మెల్యేలు కూడా రెడీ అవుతున్నారు. ఎన్నికలు,  ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా ఫ్రీ కోచింగ్​తో తమకు కొంత మేలు జరుగుతుందని నిరుద్యోగులు ఆశ పడుతున్నారు.  కాగా, గత అనుభవాల నేపథ్యంలో హైదరాబాద్​సిటీలో కోచింగ్​కు వెళ్లడంపై నిరుద్యోగులు వెనుకాముందు ఆడుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్​ఉద్యోగాలు చేస్తున్న చాలామంది ఇప్పుడు వాటిని వదిలేసి వెళ్లాక అనుకున్నట్లు ఇన్​టైంలో నోటిఫికేషన్లు వస్తాయో రావోనని అందోళన చెందుతున్నారు. 

నిరుద్యోగులకు కోచింగ్​ ఆఫర్స్​ 

ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయగానే జిల్లాల్లోని పలువురు ఎమ్మెల్యేలు నిరుద్యోగులను, ముఖ్యంగా యూత్​ను టార్గెట్​చేశారు. గ్రూప్1, గ్రూప్​2తోపాటు అన్ని రకాల పోస్టులకు ఫ్రీగా ట్రైనింగ్​ఇప్పిస్తామని సోషల్​ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. వివిధ ఫౌండేషన్లు, కుటుంబసభ్యుల పేరుతో వాట్సప్​, ఫేస్​బుక్​లాంటి వాటిల్లో ప్రకటనలు ఇస్తున్నారు. కోచింగ్​తోపాటు ఫుడ్, స్టడీ మెటీరియల్​సైతం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో క్యాంపు ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్​నగర్​ఎమ్మెల్యే సైదిరెడ్డి ‘అంకిరెడ్డి ఫౌండేషన్’ పేరుతో, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ‘మల్లన్న యువసేన’ పేరుతో కోచింగ్​ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్​రావు కొడుకు సిదార్ధ ‘ఎన్బీఆర్’ ఫౌండేషన్ ద్వారా పోలీసుల సపోర్ట్​తో నిరుద్యోగులకు ట్రైనింగ్​ఇస్తామని చెప్పారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్స్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ స్డడీ మెటీరియల్​కు ఆర్డర్​ఇచ్చిన మంత్రి వచ్చేవారమే కోచింగ్​సెంటర్​ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామని, పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్, మెటీరియల్ ఉచితంగా అందజేస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గురువారం ప్రకటించారు. గతంలో ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్​ అందించిన నాగర్ కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు జనార్ధన్​రెడ్డి, జైపాల్​యాదవ్​సైతం ఈసారి కూడా అలాంటి ఆలోచనలో ఉన్నట్లు వాళ్ల అనుచరులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కేసీఆర్​స్టడీ సర్కిల్ పేరుతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలో ఫ్రీ కోచింట్​సెంటర్​ నిర్వహిస్తున్నారు.

భయపెడుతున్న గత అనుభవాలు 

రాష్ట్రంలో ఏండ్ల తరబడి ఎలాంటి జాబ్‍ నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాది నిరుద్యోగులు ఏదో ఒక ప్రైవేట్‍ ఉద్యోగం చూసుకున్నారు. చాలామంది 5 నుంచి 10 ఏండ్ల సీనియారిటీ సంపాదించారు. తమకొచ్చే జీతంతో  ఇంటి కిరాయిలు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు. తాజాగా సీఎం ప్రకటనను నమ్మి ప్రిపరేషన్‍ కోసం ఉన్న జాబ్‍ బంద్‍ చేశాక రిక్రూట్‍మెంట్‍ ప్రాసెస్‍ లేటైతే తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు.  గత అనుభవాలు కూడా వాళ్లను కలవరపెడుతున్నాయి.  టీఆర్ఎస్​ ప్రభుత్వంలో చాలా జాబ్​నోటిఫికేషన్లు ఏండ్లకేండ్లు కొనసాగాయి. నోటిఫికేషన్​వేశాక రెండు మూడు నెలల్లో నిర్వహించాల్సిన రిక్రూట్‍మెంట్‍ ఏదో ఒక వంకతో రెండేళ్ల దాకా గడిచిన సందర్భాలు, ఇంటర్వ్యూలూ పూర్తయినా పోస్టింగులు ఇవ్వకుండా నేటికీ అలాగే పెండింగ్​పెట్టిన ఉదంతాలు ఉన్నాయి.  ఇక వివిధ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది చిరు ఉద్యోగులు తమ చదువుకు తగిన జాబ్‍ రాలేదనే డిసప్పాయింట్‍లో ఉన్నారు. పీజీలు, పీహెచ్‍డీలు చేసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఫోర్త్ క్లాస్‍ ఎంప్లాయిస్‍గా ఉండిపోయారు. వీళ్లంతా పైస్థాయి పోస్టింగుల కోసం ట్రై చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రిపరేషన్‍ కోసం కనీసం ఐదారు నెలల లీవ్‍ పెట్టాల్సి వస్తుంది. ఈ లెక్కన  రూ.2 నుంచి 3 లక్షల జీతం కోత పడుతుంది. తీరా రిక్రూట్‍మెంట్‍ వాయిదా పడితే ఎలా అనే టెన్షన్‍ పడుతున్నారు. మొత్తంగా  సీఎం ప్రకటనపై అందరిలోనూ హ్యాపీ ఉన్నా అది అమలుకావడంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటు హ్యాపీ.. అటు టెన్షన్‍

నేను ఎంబీఏ చదివా. చాలా నెలలు ప్రిపేర్‍ అయ్యా. సర్కారు జాబ్‍ క్యాలెండర్‍ అమలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‍ షోరూంలో జాయినయ్యా. ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్‍ వేయడం హ్యాపీగా ఉంది. అదే టైంలో టెన్షన్‍గానూ ఉంది. ఏండ్ల తరబడి ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో ఫుల్​ కాంపిటీషన్‍ ఉంటది. దానిని తట్టుకోవాలంటే కోచింగ్‍, ప్రిపరేషన్‍ అవసరం. ప్రభుత్వమేమో విడతల వారీగా రిక్రూట్‍మెంట్‍ చేస్తామంటోంది. ఫలానా జాబ్‍కు ఫలానా టైం అని చెప్పట్లేదు. ప్రిపరేషన్‍ కోసం జాబ్‍ బంద్‍ చేయాలి. గతంలో మాదిరి ఏదో ఒక కారణంతో రిక్రూట్‍మెంట్‍ లేట్‍ అయితే ఉన్న జాబ్‍ పోతదని ఆలోచిస్తున్నా.   
– చుంచు శ్రీధర్‍, ప్రైవేట్‍ ఎంప్లాయ్‍, హనుమకొండ