
- అధికారులను కాదని ఎమ్మెల్యేలకు అప్పగింత
- ఇప్పటికే స్థలాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ వివాదాల్లో లీడర్లు
- జీవో 58, 59 కింద క్రమబద్ధీకరణకు నెల రోజుల గడువు పొడిగింపు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందుల్లేకుండా, నిబంధనల మేరకు ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీవో 58, 59ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెంటనే తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ, ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ సమస్యలను చెప్పుకోవాలని ప్రజలను కోరారు. ఈమేరకు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు నోటరీ, 58, 59 జీవోలకు సంబంధించిన సమస్య ల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు.
ఏకకాలంలో సమస్యలు పరిష్కరిస్తం
భూములు, ఇండ్ల స్థలాల సమస్యలు ఎమ్మెల్యేలకు చెప్పుకుంటే.. అన్ని క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను అందజేస్తామని కేసీఆర్ తెలిపారు. ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇళ్ల సమస్యలు పరిష్కారం కావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ మని, ఇందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
జులైలోపు కరివెన జలాశయానికి నీరు తరలించాలి
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో జులై లోపు కరివెన జలాశయానికి నీళ్లు తరలించాలని, ఆగస్టు వర కు ఉద్దండపూర్ దాకా నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్‌లో కేసీఆర్ సోమవారం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొదటిసారిగా సమీక్ష నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండపూర్ జలాశయాలకు సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత పంప్ హౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఒక రిజర్వాయర్ నుంచి మరొక రిజర్వాయర్‌కు నీటిని తరలించే ‘కన్వేయర్ సిస్టమ్’లో మిగిలిన పనులను కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపైనా సీఎం సమీక్షించారు. వాటిలో మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్‌లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వామ్మో స్థలాల సమస్యలు ఎమ్మెల్యేల వద్దకా!
ఏదైనా సమస్య ఉంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారుల దగ్గరకు వెళ్లి అప్లికేషన్ పెట్టుకోమని చెబుతుంది. లేదంటే ఆన్లైన్లో ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే పరిశీలించి సమస్య పరిష్కరిస్తుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేలను కలి సి చెప్పుకోవాలంటున్నది. అదీ కూడా స్థలాలకు సంబంధించినది. నోటరీ, తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ కోసం తమ ఎమ్మెల్యేలను కలవడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో స్థలాలు, సాగు భూ ములకు సంబంధించిన పంచాయితీల్లో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల ప్రమేయమే ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. స్థల సమస్యలను ఎమ్మెల్యేల దగ్గరకు తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు ప్రతీ దాంట్లో కమీషన్లు అడుగుతున్నారని, ఇప్పుడు ల్యాండ్స్ సమస్యలు పరిష్కరించమని వాళ్ల దగ్గరకు పోతే ఇంకింత ముదిరిపోతదని భావిస్తున్నారు.
కమీషన్లు తీసుకుంటున్నరు!
దళితబంధు, కళ్యాణ లక్ష్మీ, గృహ లక్ష్మీ వంటి స్కీమ్స్ అన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే పార్టీ మీటింగుల్లో చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇండ్ల స్థలాలు, సాగు భూముల నోటరీలకు సంబంధించి ఎమ్మెల్యేల దగ్గరకి వెళ్లమనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, జీవో నంబర్ 58 కింద 3.48 లక్షల అప్లికేషన్లు, జీవో నంబర్ 59 కింద 48,575 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 3.96 లక్షల దరఖాస్తులు గతంలో వచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ దాకా మళ్లీ లక్ష దాకా వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మరిన్ని అప్లికేషన్లు వస్తే నోటరీ ఆస్తులను రెగ్యులరైజ్ చేయాలంటే పెద్ద సమస్య వస్తుందని అంటున్నారు.